కార్మిక శాఖ మంత్రి, కార్మికులకు కనీస వేతనం ఎక్కడ? 

 కార్మిక శాఖ మంత్రి, కార్మికులకు కనీస వేతనం ఎక్కడ? 

  • మైనారిటీ గురుకులాల్లో రూ.10–12 వేల వేతనాలతో ఏళ్ల తరబడి సేవలు 
  • తెలంగాణ రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రాజమ్మద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రాజమ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న కుకింగ్ స్టాఫ్‌కు నెలకు సుమారు రూ.12,000, హౌస్‌కీపింగ్ సిబ్బందికి రూ.12,000, హెల్పర్లకు రూ.10,000 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ సిబ్బంది ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యార్థుల భోజనం, పరిశుభ్రత, వసతి గృహాల నిర్వహణ తదితర కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 205 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో దాదాపు 3,500 మంది కుకింగ్, హౌస్‌కీపింగ్, హెల్పర్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారని రాజమ్మద్ తెలిపారు. వీరి సేవలు లేకుండా గురుకులాల రోజువారీ నిర్వహణ సాధ్యం కాదని అన్నారు. గత పదేళ్లుగా వేతనాల పెంపు కోసం మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, కార్యదర్శులకు పలుమా ర్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, “ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాలి” అనే సమాధానమే వస్తోందని ఆయన తెలిపారు. పదేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాలానుగుణంగా వేతన సవరణలు, ఇంక్రిమెంట్లు, ఇతర ప్రయోజనాలు అందుతున్నప్పటికీ, గురుకులాల నిర్వహణలో కీలకంగా పనిచేస్తు న్న ఔట్‌సోర్సింగ్ కార్మికులకు మాత్రం తగిన వేతన పెంపు లేకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “కనీస వేతనాల కమిటీ కార్మికుల పరిస్థితిని పరిశీలించాలి. పదేళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న గురుకుల కార్మికులకు వర్తించే కనీస వేతన నిబంధనలను కార్మిక శాఖ స్పష్టంగా పరిశీలించాలి” అని రాజమ్మద్ కోరారు. అదేవిధంగా “నాన్-శాంక్షన్డ్ పోస్టులు” అనే కారణంతో సంవత్సరాలుగా ఇదే సిబ్బందితో గురుకులాలను నిర్వహిస్తూ, వారి శ్రమకు తగిన వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించకపోవడం సరైన విధానం కాదని అన్నారు. అవసరమైన పోస్టులను మంజూరు చేసి, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సిబ్బంది సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ సమస్యను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదని రాజమ్మద్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్న నేపథ్యంలో, పదేళ్లుగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న మైనారిటీ గురుకుల కార్మికుల సమస్యపై తక్షణమే దృష్టి సారించాలని కోరారు. కార్మిక శాఖ మంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న సుమారు 3,500 మంది ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలను సమీక్షించి, వారికి వర్తించే కనీస వేతన చట్టాలు, నిబంధనల ప్రకారం తగిన వేతనాలు అమలు చేయాలని మహమ్మద్ రాజమ్మద్ డిమాండ్ చేశారు. “పదేళ్లుగా సేవలందిస్తున్న కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. గురుకులాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, న్యాయమైన వేతనం కల్పించాలి” అని మహమ్మద్ రాజమ్మద్ కోరారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News