రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ బీజేపీ అహంకార, నిరంకుశ వైఖరికి నిదర్శనం

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ బీజేపీ అహంకార, నిరంకుశ వైఖరికి నిదర్శనం

హుస్నాబాద్ : దళితులపై వివక్ష, అంటరానితనాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని -మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఈ సందర్బంగా మంత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా గళం వినిపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం బీజేపీ అహంకార, నిరంకుశ వైఖరికి నిదర్శనమని, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎదుర్కొన్న అవమానకర పరిస్థితులపై రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే, సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రశ్నించిన రాహుల్ గాంధీపైనే కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని మంత్రి అన్నారు.అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా అంటరానితనం, కుల వివక్షను నిర్మూలించలేరని స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం, అన్యాయాన్ని ప్రశ్నించిన వారినే నిందితులుగా చిత్రీకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.అంటరానితనాన్ని రాజ్యాంగం ద్వారా నిర్మూలించడం నుంచి ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టాల రూపకల్పన వరకు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా పోరాటం చేసిందని మంత్రి పేర్కొన్నారు.దళితులపై వివక్షను నిర్మూలించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న నిర్దిష్ట చర్యలు ఏమిటో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అంటరానితనం నిర్మూలన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ చేపట్టిన ఉద్యమాలు, చేసిన పోరాటాలు ఏమిటో కూడా ప్రజలకు వివరించాలని అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలైన సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా నిలుస్తుందని, కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News