బీజేపీ కార్యాలయాలపై దాడులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
కాటారం (భూపాలపల్లి) : నల్గొండలో బీజేపీ కార్యాలయం, నాయకుల నివాసాలపై జరిగిన దాడులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్ల నారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాటారం మండల అధ్యక్షుడు పాగె రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రతిపక్షాలపై అణచివేత చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. బీజేపీ కార్యాలయాలపై దాడి ఘటనను బ్లాక్ డేగా భావిస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై దాడి, ఆయన తల్లిని బెదిరించడం పిరికిపంద చర్య అన్నారు. దాడులను ప్రశ్నించేందుకు నల్గొండ వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును హౌస్ అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. పాగె రంజిత్ కుమార్ మాట్లాడుతూ దాడులతో బీజేపీ పోరాటాన్ని ఆపలేరని అన్నారు. 420 హామీలను ప్రశ్నించినందుకే దాడులకు పాల్పడటం సరికాదని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు దుర్గం తిరుపతి, బొమ్మన భాస్కర్ రెడ్డి, డోలి అర్జయ్య, గోగుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


