విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలి : జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కే. కిరణ్మయి
రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ-ప్రైమరీ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ ఎల్ బీ డాక్టర్ కే. కిరణ్మయి మంగళవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన స్థాయిలు, మౌలిక వసతులు తదితర అంశాలను ఆమె పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చేపడుతున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని నిరంతరం పర్యవేక్షించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను అవలంబించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం ప్రీ-ప్రైమరీ కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్ చిన్నారులకు అందిస్తున్న బోధన, ఆటలు, అభ్యసన కార్యకలాపాలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. చిన్నారుల వయస్సుకు అనుగుణంగా ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణంలో అభ్యసన కు అనుకూలమైన కార్యకలాపాలను నిర్వహిస్తూ నాణ్యమైన ప్రీ-ప్రైమరీ విద్యను అందించాలని సూచించారు. అనంతరం ఇంద్రా నగర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని గ్రామ సభలో చర్చించిన గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలను ఆమె సమీక్షించారు. గ్రామ సభలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, అభ్యర్థనలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, పారదర్శకంగా మరియు నిర్దేశిత గడువులోగా అమలు చేయాలని ఆమె సూచించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


