డ్రై రన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ :అంజనగిరి రిజర్వాయర్ పరిధిలోని మిషన్ భగీరథ ప్రత్యామ్నాయ పంప్ హౌస్ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నార్లాపూర్ శివారులో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 7న నిర్వహించనున్న డ్రై రన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంప్ హౌస్ నిర్మాణం, పంపుల ఏర్పాటు, విద్యుత్ సరఫరా పనుల్లో ఎలాంటి సాంకేతిక లోపాలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రై రన్ కు ముందే అన్ని సాంకేతిక, విద్యుత్ పనులను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. మొత్తం 6 పంపుల ఏర్పాటులో భాగంగా ఇప్పటికే 4 పంపుల పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. డ్రై రన్ విజయవంతం కాగానే వెట్ రన్ కు సిద్ధం కావాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.పంప్ హౌస్ ప్రత్యేకతలు:
- ఒక్కో పంపు 1.7 మెగావాట్ల సామర్థ్యం
- ఒక్కో పంపు ద్వారా 9,000 క్యూబిక్ మీటర్ల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 3,912 గ్రామాలకు తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని, లక్ష్య సాధనకు శాఖల మధ్య సమన్వయం అవసరమని కలెక్టర్ అన్నారు. ప్రజలకు నిరంతర, సురక్షిత తాగునీరు అందేలా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


