మంజీరా నీటిపై చార్మినార్ బేవరేజెస్ దోపిడీ?
- ఒప్పందం ముగిసినా కొనసాగిన నీటి వినియోగం?
- పునరుద్ధరణ ఆర్డర్లు కానరావు.. ఫైర్ సేఫ్టీ అనుమతులపైనా ప్రశ్నలు
- ఆరున్నరేళ్లుగా అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
- ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం జరిగిందా?
- రాయల్టీ లెక్కలు తేల్చాలని స్థానికుల డిమాండ్
చౌటకూర్, ఆగస్టు 12 :- సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట పరిధిలోని చార్మినార్ బేవరేజెస్ పరిశ్రమకు మంజీరా నది నుంచి నీటి వినియోగానికి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నీటి సరఫరా ఒప్పందం ముగిసిన తర్వాత కూడా పరిశ్రమ మంజీరా నీటిని వినియోగించిందా? వినియోగించి ఉంటే ఏ అనుమతుల ఆధారంగా నీటిని తీసుకుంది? ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ ఎంత? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. రికార్డుల ప్రకారం.. ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.250, ఇరిగేషన్ అండ్ సీఏడీ శాఖ, తేదీ 18-09-1993 ద్వారా అప్పటి పుల్కల్ మండలం పరిధిలోని శివంపేట వద్ద మంజీరా నది నుంచి రోజుకు 1,20,000 గ్యాలన్ల నీటిని తీసుకునేందుకు ఎం/ఎస్ చార్మినార్ బేవరేజెస్ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చింది. అయితే ఈ అనుమతి నీటి లభ్యతకు శాశ్వత హామీ కాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. వేసవిలో నీటి ప్రవాహం తగ్గే పరిస్థితుల్లో తాగునీరు, సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే పరిశ్రమకు నీటిని సరఫరా చేయాలనే నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది.అంటే పరిశ్రమకు నీటి వినియోగానికి అనుమతి ఉన్నప్పటికీ.. నిరంతరం నీటిని పొందే హక్కు శాశ్వతంగా ఉండదని స్పష్టమవుతోంది. ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా ఇరిగేషన్ శాఖతో కాలానుగుణంగా నీటి సరఫరా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది.
కంపెనీ పేర్లు మారినా.. నీటి వ్యవహారం కొనసాగిందా?
కాలక్రమంలో కంపెనీ యాజమాన్య పేర్లు మారినట్లు రికార్డులు చెబుతున్నాయి. చార్మినార్ బేవరేజెస్ లిమిటెడ్ తర్వాత షెల్ బేవరేజెస్ లిమిటెడ్, అనంతరం సాబ్ మిల్లర్ ఇండియా లిమిటెడ్‌గా పేర్లు మారినట్లు సమాచారం. చివరగా 2018-19 సంవత్సరానికి సాబ్ మిల్లర్ ఇండియా లిమిటెడ్‌తో కుదిరిన నీటి సరఫరా ఒప్పందం 08-02-2019తో ముగిసినట్లు రికార్డుల్లో పేర్కొనబడింది.ఇక్కడి నుంచే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఒప్పందం ముగిసిన తర్వాత కొత్త ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆ మధ్యకాలంలో పరిశ్రమ మంజీరా నీటిని వినియోగించిందా? వినియోగించి ఉంటే ఏ అనుమతి ఆధారంగా నీటిని తీసుకుంది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
రెండున్నరేళ్ల తర్వాతే పునరుద్ధరణకు దరఖాస్తు?
2019లో కంపెనీ పేరు అన్హైజర్ బుష్ ఇన్‌బెవ్ ఇండియా లిమిటెడ్‌గా మారినట్లు రికార్డుల్లో ఉంది. అయితే కొత్త నీటి సరఫరా ఒప్పందం కోసం కంపెనీ 06-09-2021న దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అంటే 08-02-2019న పాత ఒప్పందం ముగిసిన తేదీకి, 06-09-2021న కొత్త ఒప్పందం కోసం దరఖాస్తు చేసిన తేదీకి మధ్య సుమారు రెండున్నర సంవత్సరాల వ్యవధి ఉంది.ఈ కాలంలో పరిశ్రమ మంజీరా నీటిని ఉపయోగించిందా? ఉపయోగించి ఉంటే రోజుకు ఎంత నీటిని తీసుకుంది? ఏ అనుమతి ఆధారంగా నీటిని వినియోగించింది? నీటి వినియోగాన్ని ఇరిగేషన్ అధికారులు మీటర్ల ద్వారా నమోదు చేశారా? రికార్డులు ఎక్కడ ఉన్నాయి? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.
రాయల్టీ లెక్కలు తేల్చాల్సిందే
ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.115, ఇరిగేషన్ శాఖ, తేదీ 27-06-2015 ద్వారా పారిశ్రామిక నీటి వినియోగానికి రాయల్టీ రేట్లను నిర్దేశించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2021, 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి పెంచిన రేట్ల ప్రకారం సంస్థ రాయల్టీ చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. అయితే 2019, 2020 సంవత్సరాలకు మాత్రం పెంచిన రేట్లకు బదులుగా పాత రేట్ల ప్రకారం చెల్లింపులు చేసినట్లు సమాచారం.ఇది నిజమైతే ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ఎంత? వసూలు చేసింది ఎంత? తేడా ఎంత? బకాయిలు ఉంటే వాటిపై వడ్డీ, పెనాల్టీ విధించారా? విధించి ఉంటే ఎప్పుడు వసూలు చేస్తారు? అనే అంశాలపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది.
ఫైర్ సేఫ్టీ అనుమతులపైనా అనుమానాలు
ఇదిలా ఉండగా.. పరిశ్రమకు జారీ చేసిన ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ అనుమతి 17-05-2013తో గడువు ముగిసినట్లు సమాచారం. అనంతరం ఫైర్ ఎన్‌వోసీ పునరుద్ధరణ జరిగిందా? లేదా? అనే అంశంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం పరిశ్రమ వద్ద అమల్లో ఉన్న ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఏది? ఇటీవల అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారా? భారీ స్థాయిలో ఉత్పత్తి, నిల్వలు, యంత్రాలు, కార్మికులు ఉండే పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవిస్తే అత్యవసర రక్షణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయా? అనే అంశాలను అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
ఈ వ్యవహారంపై అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఒప్పందం లేకుండానే నీటి వినియోగం జరిగిందా?
2019 ఫిబ్రవరి 8న పాత నీటి సరఫరా ఒప్పందం ముగిసిన తర్వాత.. 2021 సెప్టెంబర్ 6న కొత్త ఒప్పందం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, మధ్యకాలంలో పరిశ్రమ మంజీరా నీటిని వినియోగించిందా? అనే ప్రశ్న కీలకంగా మారింది.
నీటిని వినియోగించి ఉంటే ఏ ఒప్పందం ఆధారంగా, ఏ అనుమతితో వినియోగించారు? రోజుకు ఎంత నీరు తీసుకున్నారు? నీటి పారుదల శాఖ మీటర్ రీడింగులు నమోదు చేసిందా? రాయల్టీ ఎంత చెల్లించారు? చెల్లింపుల వివరాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
ఒప్పందం లేకపోయినా నీటి సరఫరా కొనసాగి ఉంటే.. దానికి బాధ్యత ఎవరిది? నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేశారు? అనే అంశాలపై సమగ్ర విచారణ అవసరమని స్థానికులు అంటున్నారు.
కాలుష్య ఆరోపణలు.. నమూనాల సేకరణ.. నివేదిక ఎక్కడ?
మరోవైపు పరిశ్రమ నుంచి వ్యర్థజలాలు మంజీరా నదిలోకి చేరుతున్నాయనే ఆరోపణలు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు సమాచారం.ఆ నమూనాల పరీక్షా ఫలితాలు ఏమిటి? నీటి నాణ్యత ఎలా ఉంది? కాలుష్య ప్రమాణాలు మించాయా? పరిశ్రమ వ్యర్థజలాల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉందా? కాలుష్య నియంత్రణ మండలి విధించిన షరతులు అమలులో ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.పరీక్షా నివేదికను బహిర్గతం చేస్తేనే ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలపై వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఆరున్నరేళ్లుగా అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
ఈ అంశంపై అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. 2019 ఫిబ్రవరి 9 నుంచి 2025 ఆగస్టు 12 వరకు నీటి సరఫరాకు సంబంధించి నిరంతర ఒప్పందం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు కనిపించడం లేదని సమాచారం. ఈ కాల వ్యవధి సుమారు ఆరున్నర సంవత్సరాలు. ఇంతకాలం ఒక భారీ పరిశ్రమ మంజీరా నీటిని వినియోగిస్తుంటే ఇరిగేషన్ శాఖ అధికారులు ఏం చేశారు? నీటి వినియోగాన్ని కొలిచే మీటర్లు ఉన్నాయా? వాటి రీడింగులు ఎక్కడ ఉన్నాయి? ప్రతి సంవత్సరం రాయల్టీ డిమాండ్ నోటీసులు జారీ చేశారా? బకాయిలు ఉంటే వాటిని ఎందుకు వసూలు చేయలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒప్పందం గడువు ముగిసిన విషయం తెలిసినా నీటి సరఫరా కొనసాగితే.. దానికి బాధ్యులెవరు? అనే అంశం కూడా సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది.
కలెక్టర్ స్థాయిలో సమగ్ర విచారణకు డిమాండ్
మంజీరా నది నీటి వినియోగం, నీటి సరఫరా ఒప్పందాలు, రాయల్టీ చెల్లింపులు, ఫైర్ సేఫ్టీ అనుమతులు, పరిశ్రమ వ్యర్థజలాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ నిబంధనల అమలు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని చౌటకూర్ పరిసర ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వయంగా ఈ వ్యవహారంపై దృష్టి సారించి సంబంధిత శాఖలతో సంయుక్త విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు కోరుతున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ బకాయిలు ఉంటే వాటిని లెక్కించి వడ్డీ, పెనాల్టీతో సహా వసూలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
‘దరఖాస్తు చేసుకున్నాం.. ప్రభుత్వం మంజూరు చేయలేదు’
ఈ అంశంపై కంపెనీ హెచ్‌ఆర్‌ను సంప్రదించగా.. కంపెనీ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ ప్రతినిధి పాండురంగారావును సంప్రదించాలని సూచించారు. అనంతరం పాండురంగారావును ఫోన్‌లో సంప్రదించగా.. కొత్త నీటి సరఫరా ఒప్పందం కోసం దరఖాస్తు చేసుకున్నా మని, అయితే ప్రభుత్వం అనుమతి మంజూరు చేయలేదని తెలిపారు. ప్రతి సంవత్సరం నీటి వినియోగానికి రెన్యువల్ ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించగా.. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే తాము ఏం చేయాలని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని కూడా సూచించారు. అయితే ఒప్పందం ముగిసిన తర్వాత పరిశ్రమ మంజీరా నీటిని ఏ ప్రాతిపదికన వినియోగించింది? ఆ కాలానికి సంబంధించిన నీటి వినియోగం, మీటర్ రీడింగులు, రాయల్టీ చెల్లింపుల వివరాలు ఏమిటి? అనే ప్రశ్నలకు అధికారిక రికార్డుల ద్వారానే స్పష్టత రావాల్సి ఉంది.

Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Aug 2026 16:40:04
శివ్వంపేట (మెదక్): శివంపేట మండల పరిధిలోని పెద్దగొట్టిముక్ల ZPHS పాఠశాలలో బుధవారం విద్యార్థుల్లో చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే...
