మున్సిపల్ కార్మికుని అంత్యక్రియల డబ్బుల కోసం కార్మికుల ఆందోళన.
బోధన్, (నిజామాబాద్) : బోధన్ మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న శివలింగం అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియల కోసం మున్సిపాలిటీ నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం విషయంలో అధికారులు తొలుత స్పందించకపోవడంతో కార్మికులు, యూనియన్ ప్రతినిధులు ఆందోళనకు సిద్ధమయ్యారు. శివలింగం మృతిచెందిన విషయం తెలుసుకున్న కార్మికులు అంత్యక్రియల ఖర్చుల కోసం మున్సిపల్ అధికారులను సంప్రదించారు. అయితే డబ్బులు ఇవ్వడంపై అధికారులు తాత్సారం చేయడంతో యూనియన్ నాయకులకు విషయం తెలియజేశారు. దీంతో టీయూసీఐ, సీఐటీయూ నాయకు లు మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. డబ్బులు పంపిస్తామని అధికారులు చెప్పినా, కొంతసేపటి వరకు చెల్లింపులు జరగకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఆర్డీవోను సంప్రదించాల్సి ఉందని, అందువల్ల వెంటనే డబ్బులు ఇవ్వలేమని చెప్పడంతో కార్మికులు అంత్యక్రియల ఏర్పాట్లను నిలిపివేసి, మృతదేహాన్ని మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్, అధికారులు శివలింగం ఇంటికి చేరుకుని అంత్యక్రియల కోసం కావాల్సిన డబ్బులను చెల్లించారు. ఈ సందర్భంగా శివలింగానికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, కుటుంబానికి అండగా ఆయన భార్యకు ఉద్యోగం కల్పించాలని కార్మికులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఔట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన జీవో ప్రకారం మృతి చెందిన కార్మికుల వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించే నిబంధన ఉందని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే మృతి చెందిన, పదవీ విరమణ చేసిన 16 మంది కార్మికుల వారసులకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లామని, అయితే వాటికి ఇంకా ఆమోదం లభించలేదని వివరించారు. జీవో ప్రకారం అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్ హామీతో కార్మికులు శాంతించి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి శివలింగం అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి.మల్లేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జే. శంకర్ గౌడ్, టీయూసీఐ బోధన్ పట్టణ మున్సిపల్ కార్మిక నాయకులు బి. పర్వయ్య, గంగామణి, పోశెట్టి, గంగాధర్, భూమయ్య, రాణి, లావణ్య, లక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
Views: 47
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
13 Aug 2026 18:24:32
ప్రశ్నించే గొంతే కమ్యూనిజం
దేశ భవిష్యత్తు కు అసలైన దిక్సూచి ఈ కమ్యూనిజం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
