గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

- ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ
– ఇద్దరు మహిళలు దుర్మరణం , మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- సంఘటన స్థలానికి పర్యవేక్షణ చేసిన పోలీస్ కమీషనర్

 
 నిజామాబాద్ : తీర్థయాత్రకు బయలుదేరిన భక్తులకు ఆర్మూర్ మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి దర్శనం కోసం రెండు టూరిస్ట్ బస్సుల్లో తీర్థయాత్రకు బయలుదేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపానికి చేరుకున్న సమయంలో ముందుగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు TG 01 T 1864 టైర్ పంచర్ కావడంతో రెండుTG 21 T 2172 బస్సులను జాతీయ రహదారిపై నిలిపివేశారు. టైర్ పంచర్ కావడంతో బస్సులోని కొంతమంది ప్రయాణికులు కిందికి దిగి , రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ GT 27 TF 7482 డ్రైవర్ ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును సకాలంలో గుర్తించకపోవడంతో బస్సును బలంగా ఢీకొట్టాడు. లారీ ఢీకొట్టడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సు ముందుకు కదిలి , డివైడర్ ప్రాంతంలో కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత ( 54 ) , మాధవి ( 47 ) అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ప్రయాణికులు సునీత ,  చిటక్క లకు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ఘ టన సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.,సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు , వాహనాలు ఏ విధంగా నిలిపి ఉన్నాయనే అంశాలతో పాటు లారీ ఢీకొన్న తీరును అధికారులు కమిషనర్‌కు వివరించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ , క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన విధానం తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని , వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం
జాతీయ రహదారులపై వాహనాలు టైర్ పంచర్ కావడం, సాంకేతిక లోపాలు ఏర్పడటం వంటి సందర్భాల్లో వాహనాలను రహదారిపై నిలిపినప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా వాహనంలోని ప్రయాణికులు రహదారిపైకి వచ్చి డివైడర్లు లేదా రహదారి పక్కన కూర్చోవడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. వాహనం ఆగిపోయిన వెంటనే ప్రమాద హెచ్చరిక లైట్లు ఆన్ చేయడంతో పాటు, తగిన దూరంలో రిఫ్లెక్టివ్ వార్నింగ్ ట్రయాంగిల్స్ లేదా ఇతర హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రయాణికులు కూడా రహదారిపై కాకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి లారీ డ్రైవర్ నిర్లక్ష్యం , అతివేగం తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్బంగా ఆర్మూర్ ఎ.సి.పి శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎస్హెచ్ఓ శ్రీ సత్యనారాయణ  , ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాహుల్ కుమార్ ,  ఆర్మూర్ ,  జక్రాన్ పల్లి  , బాల్కొండ ఎస్సైలు మరియు అసిస్టెంట్ ఎం.వి.ఐ తదితరులు పాల్గొనడం జరిగింది. IMG-20260813-WA0521
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News