ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలముఠా గుట్టురట్టు
-నిఘా వర్గాల పక్కా సమాచారంతో దొంగల అరెస్ట్. వివరాలు వెల్లడించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన పగటిపూట వరుస దొంగతనాల కేసును నవీపేట్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య దిశానిర్దేశంతో, నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సి. ప్రకాష్ యాదవ్ పర్యవేక్షణలో నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా గుట్టురట్టయింది. బుధవారం జిల్లా పోలీస్ కమిషనరేట్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీపీ. పి సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. నవీపేట్ ఎస్.ఐ. కె. శ్రీకాంత్, సీసీఎస్ టీమ్, ఏసీపీ పి. శ్రీశైలం, సీఐ అజయ్ కుమార్, సిబ్బంది సమన్వయంతో నిందితుల కదలికలపై నిఘా పెట్టి, నమ్మదగ్గ పక్కా సమాచారం అందిన వెంటనే బుధవారం ఉదయం 11:00 గంటల సమయంలో నిజామాబాద్ వైపు వస్తున్న నిందితులను చాకచక్యంగా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారన్నారు.ఈ అంతర్రాష్ట్ర దొంగలు అత్యంత మోసపూరిత పద్ధతులను అవలంబిస్తూ పోలీసుల కళ్ళు గప్పుతున్నారు. ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టిన కార్ల నంబర్లను సేకరించి, నకిలీ నంబర్ ప్లేట్లు తయారు చేయించి వాటిని తమ హోండా సిటీ కారుకు మార్చుకుంటూ తిరుగుతున్నారన్నారు. పాన్ షాపులు నిర్వహించడం, పండ్ల వ్యాపారం చేయడం, భిక్షాటన చేయడం వంటి ముసుగుల్లో తిరుగుతూ ప్రధాన నిందితుడు సయ్యద్ షకీల్ ఇంట్లోకి వెళ్లి దొంగతనాలకు పాల్పడుతుండగా, మిగతా నిందితులు (షేక్ అహ్మద్, షేక్ ఇమ్రాన్) చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారేమోనని గమనిస్తూ అతనికి సహకరించేవారన్నారు . నిందితులు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలోనూ పలు దొంగతనాలకు పాల్పడి గతంలోనూ జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 14 లక్షల విలువైన ఆస్తులను పోలీసులు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 30 గ్రాముల బంగారు నెక్లెస్, బంగారు బిస్కెట్లు, ఉంగరాలు, కమ్మలు, వెండి గొలుసులు, హోండా సిటీ కారు, నకిలీ నంబర్ ప్లేట్లు, ఇనుప రాడ్లు రూ. 5000/- నగదు ఉన్నాయి. అంతర్రాష్ట్ర దొంగలముఠా గుట్టురట్టు చేసి ఇంత పెద్ద మొత్తంలో సొత్తును రికవరీ చేయడంలో కీలకపాత్ర పోషించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని సీపీ పి. సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సిబ్బందికి రివార్డులు అందజేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


