రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ

ఆత్మహత్య కేసులో ఇరికించకుండా ఉండేందుకు బాధితుడి నుంచి డబ్బుల డిమాండ్‌

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ

  హైదరాబాద్: ఆదిలాబాద్ లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో మరో పోలీసు అధికారి చిక్కారు. ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జి. రమేష్ రూ.40 వేల లంచం వ్యవహారంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బుధవారం నిర్వహించిన ట్రాప్ ఆపరేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెళ్లికాని యువతి ఆత్మహత్యకు సంబంధించి బజార్‌హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 194 కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడిని నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు, అలాగే పోలీసుల వద్ద ఉన్న అతని మొబైల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు ఎస్‌ఐ జి. రమేష్ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.మృతురాలు ఆత్మహత్యకు ముందు ఫిర్యాదుదారుడికి చివరిసారిగా ఫోన్ కాల్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని ఫిర్యాదుదారుడిని కేసులో ఇరికిస్తానని ఎస్‌ఐ బెదిరించినట్లు ఏసీబీ ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. మొదట రూ.50 వేలు డిమాండ్ చేయగా, ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు చివరకు రూ.40 వేలకు తగ్గించినట్లు తెలిపింది.

ఈ క్రమంలో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు. గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఫిర్యాదుదారుడిని కలిసిన ఎస్‌ఐ.. రూ.40 వేల నగదును అక్కడ ఉన్న సెంట్రింగ్ బాక్సుల కింద పెట్టాలని సూచించాడు. ఎస్‌ఐ సూచన మేరకు ఫిర్యాదుదారుడు డబ్బులను అక్కడ ఉంచాడు. దీంతో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి లంచం వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు.అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. ఎస్‌ఐ జి. రమేష్‌ను అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా అతని వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ స్పష్టం చేసింది.

లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని వెల్లడించారు.


Views: 44

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News