తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదు
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాస ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బెల్లంపల్లిలో పలువురు తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పోరాడిన ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, నెలవారీ పెన్షన్లు, ఇళ్లు, రైళ్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణ పాసులు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
హామీల అమలు కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. అరెస్టులతో ఉద్యమ స్ఫూర్తిని అణచివేయలేరని, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ముందస్తుగా అరెస్టయిన వారిలో తెలంగాణ ఉద్యమకారులు ఎలిగేటి శ్రీనివాస్, చిట్యాల మధు, శంకర్‌సింగ్, పసులేటి వెంకటేష్, ఎరుకల సుందరరావు, విజ్జగిరి రాజేందర్, గద్దల ధర్మేందర్ ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


