మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్
ఆదిలాబాద్ : అదిలాబాద్ పట్టణంలోని మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న మెహందీ డిజైన్, మగ్గం వర్క్ మరియు టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదిలాబాద్ మైనార్టీస్ కామన్ సర్వీస్ సెంటర్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, మహిళలు కేవలం ఇంటి బాధ్యతలకే పరిమితం కాకుండా, తమలోని నైపుణ్యాలను వెలికితీసి ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ శిక్షణ అవకాశాలను మైనార్టీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెహందీ డిజైనింగ్, మగ్గం వర్క్, టైలరింగ్ వంటి కోర్సుల్లో నైపుణ్యం సంపాదించడం ద్వారా మహిళలు స్వయంగా ఉపాధి పొందడమే కాకుండా, భవిష్యత్తులో చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించి ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని తెలిపారు. శిక్షణను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా నేర్చుకొని, నేర్చుకున్న విద్యను తమ జీవితంలో ఉపయోగించుకోవాలని కోరారు. మహిళల అభ్యున్నతి, సాధికారత మరియు స్వయం ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఇలాంటి ఉచిత శిక్షణ కార్యక్రమాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ కలీం అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

