ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

* చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి

* గ్రామీణ క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

* పాఠశాల అభివృద్ధికి 60 లక్షలతో పనులు 

* నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

* సిరికొండ ఆదర్శ పాఠశాలలో ఘనంగా ఎస్‌జీఎఫ్ మండలస్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా సిరికొండ లోని ఆదర్శ పాఠశాలలో గురువారం ఎస్‌జీఎఫ్ (SGF) మండలస్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్న క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అంతకుముందు పాఠశాలలో రూ.60 లక్షలతో వాలీబాల్, క్రికెట్ గ్రౌండ్ తదితర పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని చూసి నిరుత్సాహపడకుండా ప్రతి ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
గ్రామీణ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం
గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ, నైపుణ్యం కలిగిన విద్యార్థులు ఉన్నారని, వారిలోని సామర్థ్యాలను వెలికితీసి తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌తో పాటు వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోందన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించి, గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలని కోరారు.
విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని, దాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా ధర్పల్లి మండలంలో రూ.8 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులతో పాటు ప్రత్యేక శ్రద్ధ అవసరమైన పిల్లలకు మెరుగైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
 నియోజకవర్గంలోని పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
పాఠశాలలో విద్యుత్ బిల్లులు సైతం లేకుండా భారం కలగకుండా చూస్తున్నామన్నారు. పాఠశాలకు అవసరమైన మరిన్ని పనులు చేపడతామని సిబ్బంది విన్నవించినా బస్సు సౌకర్యం, పాఠశాలకు పరీక్షా కేంద్రం ఏర్పాటు తదితర వాటికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పనతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.ప్రత్యకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక. క్రీడాకారుడని గుర్తు చేస్తూ.. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను చాటుకునేలా అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రశంసలు
క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్యాలు, కోలాటాలు, మార్చ్‌ఫాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అభినందించారు. వివిధ ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి ప్రోత్సహించారు.
విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని, తమ ప్రతిభను చాటుకోవాలని, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ పాఠశాలకు, గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవర్ధన్, నాయకులు ఉమ్మాజి నరేష్, గొల్ల ఎర్రన్న, బాకరం రవి,గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, దేగం సాయన్న , చందర్ నాయక్, క్రీడా నిర్వాహకులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News