కొమురవెల్లి మండల కేంద్రంలో ప్రారంభమైన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
-వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి*
-రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి – కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి
కొమురవెల్లి మండల పరిధిలోని మర్రి ముస్త్యాల, గౌరయపల్లి, కొమురవెల్లి, రాంసాగర్, అయినా పూర్, గురువన్నపేట, కిష్టంపేట, గ్రామాలలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని తెలిపారు.రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని చైర్మన్ సూచించారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ సంచులు, తూకం యంత్రాలు, ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర, కొనుగోలు విధానంపై అవగాహన కల్పిస్తూ, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంజ మల్లేష్, చేర్యాల పట్టణ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్, సంబంధిత ప్రజాప్రతినిధులు, APM లు , CC లు, CA లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఐకేపీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


