ఈ స్వీట్లు తింటే ఆస్పత్రికే అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా తయారీ కేంద్రాలు
నిజామాబాద్ : స్వీట్లు చూస్తేనే నోరూరించే రంగులు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే.. కానీ వాటి తయారీ కేంద్రాల్లోకి ఒక్కసారి చూస్తే మాత్రం వాంతులు రావడం ఖాయం. నగరంలోని పలు స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాలపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడులు చేయగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి.
14 బృందాలతో..
ఈనెల 3న హైదరాబాద్ నుంచి వచ్చిన టీజీ సేఫ్ అధికారులు పలు స్వీట్లు, ఖారా తయారు చేసే దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఏకకాలంలో సుమారు 14 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. వీరు నగరంలోని జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 ఆహార సంబంధిత వ్యాపార సంస్థల్లో (స్పైసెస్ తయారీ యూనిట్లు, ప్యాకేేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు, స్వీట్ షాపులు, బేకరీలు, రెస్టారెంట్లు) ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
అధికారులే ఆశ్చర్యపోయేలా..
ఆయా స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాల్లో అపరిశుభ్రమైన వాతావరణం చూసి అధికారులే ముక్కున వేలేసుకున్నారు. వంటగదుల్లో నేలపై వ్యర్థాలతో దుర్వాసన, బొద్దింకలు, ఈగలు, ఎలుకలు స్వేచ్ఛగా తయారీ కేంద్రాల్లో తిరుగుతుండడం అధికారులకు కనిపించింది. స్వీట్లు తయారు చేసిన ప్రాంతంలోనే ఎలుకల విసర్జితాలు ఉండడం, బొద్దింకలు తిరుగుతుండడం చూసిన అధికారులు స్వీట్లు శాంపిళ్లను తీసుకుని.. వాటిని సిబ్బంది చేత బయట పారేయించారు. ఇక ఫ్రిడ్జ్‌లలో రోజుల తరబడి ఉంచిన ఆహార పదార్థాలు ఉండి దుర్వాసన వస్తుండడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబ్బందికి మాస్కులు లేవు.. గ్లౌజ్‌లు లేవు..
తయారీ కేంద్రాల్లో స్వీట్లు, కారా తయారుచేసే వ్యక్తులు కనీసం గ్లౌజ్‌లు, మాస్క్‌లు లేకపోవడం అధికారుల దృష్టికి వచ్చింది. ఆహార పదార్థాలు తయారుచేసిన తర్వాత వాటిపై న్యూస్ పేపర్లు కప్పి ఉంచడాన్ని అధికారులు పరిశీలించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఎక్కువకాలం నిల్వ ఉంచడాన్ని అధికారులు నోట్ చేసుకున్నారు. సిబ్బంది కనీసం గ్లౌజ్‌లు, మాస్క్‌లు ఇవ్వకపోవడంపై ఆయా స్వీట్లు, కారా దుకాణాల యజమానులపై అధికారులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
26 దుకాణాల్లో శాంపిళ్ల సేకరణ..
కల్తీపై అనుమానంతో మొత్తం 26 నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 9,645 కిలోల ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేసి ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ. 17,28,495/- ఉంటుందని అంచనా. సరైన FSSAI లైసెన్సులు లేకుండా నడుస్తున్న మహారాజా స్వీట్ & బేక్స్ (మిర్చి కాంపౌండ్), పంచవటి స్వీట్స్ (దుబ్బ), శివ శక్తి ఐస్ క్రీమ్ (దుబ్బ), సాగర్ బేకరీ (ఆటోనగర్) ని తక్షణమే మూసివేయించారు.
13 సంస్థల లైసెన్సులు సస్పెన్షన్
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చప్పన్ భోగ్ స్వీట్స్, రాధే మిఠాయి వాటిక, శ్రీ రాధే ఎంటర్ప్రైజెస్, ఎల్పీ ప్రొడక్ట్స్, జునైరా ఫ్యామిలీ రెస్టారెంట్, ఖురేషియా హోటల్, వాటర్ సొల్యూషన్ కంపెనీ, జనతా ట్రేడర్స్, ఐరా ఫుడ్స్ & బెవరేజెస్, సుఖ్జిత్ స్టార్చ్ మిల్స్, శ్రీ అయ్యప్ప ట్రేడర్స్, మొఘ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్వాలిటీ స్వీట్స్ & చిక్కి/కెకె స్వీట్స్ సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన మరో 12 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, స్వల్ప లోపాలున్న మరో 3 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులోనూ ఇటువంటి దాడులు కొనసాగుతాయని టీజీ సేఫ్ కమిషనర్ హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


