మాదకద్రవ్యాల నియంత్రణకు జిల్లావ్యాప్తంగా గంజాయి స్పెషల్ డ్రైవ్
తెల్లవారుజామున 5 గంటల నుండి 90 మంది అనుమానితుల ఇళ్లలో తనిఖీలు యూరిన్ డ్రగ్ టెస్టుల ద్వారా 57 మంది గంజాయి సేవించినట్లు నిర్ధారణ గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యం
*మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతర నిఘా – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు తెల్లవారుజామున 5 గంటల నుండి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక గంజాయి తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. ఆదిలాబాద్, ఉట్నూర్ పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో గంజాయి సేవిస్తున్నట్లు అనుమానం ఉన్న వ్యక్తులు, గతంలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తుల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా మొత్తం 90 మందిని తనిఖీ చేయగా, ప్రత్యేక డ్రగ్ టెస్టింగ్ కిట్లు, యూరిన్ టెస్టుల ద్వారా 57 మంది గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించే లక్ష్యంతో ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక నిఘా, ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. మాదకద్రవ్యాల రహిత జిల్లానే లక్ష్యం.. యువత భవిష్యత్తే మా బాధ్యత.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


