ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
- ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
- అధికారులతో సమీక్షలో కలెక్టర్ భవేష్ మిశ్రా
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశం
నిజామాబాద్ : ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల కోసం క్షేత్రస్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. అక్టోబర్ 1వ తేదీ నుండి జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణకు శ్రీకారం చుడతామని అన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ అన్ని మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలతో కీలక అంశాలపై సమీక్ష జరిపారు. ధాన్యం అమ్మకాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే పకడ్బందీ కార్యాచరణతో సన్నద్ధం కావాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో సదుపాయాల కల్పనతో పాటు, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గుర్తించిన గిడ్డంగులు, ఫంక్షన్ హాళ్లు, ఆయా ప్రదేశాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలని ఆదేశించారు. కాగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించని వారిపై చర్యలు తప్పవని అన్నారు. మ్యాపింగ్ కాని వారికి, పేర్లు ఇతర వివరాలలో వ్యత్యాసం ఉన్న వారికి ఇంకనూ నోటీసులు జారీ చేయకపోతే తక్షణమే అందించాలని, నోటీసులు ఇచ్చిన వారి హియరింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తుల ప్రగతిని మండలాల వారీగా సమీక్షించిన కలెక్టర్, వచ్చే వారం నాటికి ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్ లో ఉండకుండా అన్నింటినీ పరిష్కరించాలని గడువు విధించారు. తహసిల్దార్, ఆర్డీఓ లాగిన్లలోని అన్ని మాడ్యుల్స్ కు సంబంధించిన దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తూ, భూభారతి నిబంధనల మేరకు పరిష్కరించాలని సూచించారు. హౌసింగ్ శాఖ పనితీరును సమీక్షిస్తూ, మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ పెండింగ్ ఇళ్ళ నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా లబ్దిదారులను ప్రోత్సహించాలని అన్నారు. రెండవ విడత మంజూరీలను వేగవంతం చేయాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాలని అన్నారు. 8274 డబుల్ బెడ్ రూమ్ లు పూర్తి కాగా, ఇప్పటికే వాటిలో 6713 ఇళ్ళ కేటాయింపులు పూర్తయ్యాయని, మిగిలిన 1561 ఇళ్ళను కూడా వారం వ్యవధిలో లబ్దిదారులకు లాటరీ పద్ధతిన, నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా కేటాయింపులు జరపాలని కలెక్టర్ ఆదేశించారు.
మైనారిటీ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించాలి
మైనారిటీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. మైనారిటీ సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ అబ్దుల్ హమీద్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. షాదీ ముబారక్ పథకం కింద జిల్లాకు 19.98 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించగా, 7.79 కోట్లు మాత్రమే ఇప్పటివరకు పంపిణీ జరిగిందన్నారు. ఇతర సంక్షేమ పథకాల విషయంలోనూ ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వివిధ పథకాల గురించి క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా అర్హులైన ప్రతి ఒక్కరు పతకాలను సద్వినియోగం చేసుకునేలా, ప్రభుత్వ తోడ్పాటుతో లబ్ది పొందేలా చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. లబ్దిదారుల ఎంపిక విషయంలోనూ అధికారులు జాప్యం చేయకుండా దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ అర్హత కలిగిన వారికి ఆమోదం తెలుపాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీ.ఆర్.ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయ కుమారి, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, సంబంధిత శాఖల అధికారులు, అన్ని మండలాల తహసిల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


