దేవరకొండలో ఘనంగా ‘హైదరాబాద్ విమోచన దినోత్సవ' వేడుకలు
దేవరకొండ, : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో దేవరకొండ నగరంలో పలు కళాశాలలో విద్యార్థులతో సెమినార్ కార్యక్రమం మరియు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలతో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నిజాం ఏడో నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరియు ఆయన రాక్షస మూకలైన 'రజాకార్లు' చేసిన అకృత్యాలను వివరించారు. 1947 ఆగస్టు 15న దేశమంతటికీ స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తూ ప్రజలపై దారుణమైన అణచివేతకు పాల్పడ్డారని పేర్కొన్నారు. పన్నులు (జిజ్యా) చెల్లించడానికి నిరాకరించి, తమ ఊరిని కాపాడుకునేందుకు పోరాడిన బైరానపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది అమాయక గ్రామస్తులను రజాకార్లు దారుణంగా కాల్చిచంపారని గుర్తుచేశారు. అలాగే పరకాల్ దారణం, గుండ్రంపల్లి వంటి అనేక ప్రాంతాల్లో జరిపిన నరమేధాలు దక్షిణ భారతదేశపు జాలియన్‌వాలా బాగ్ ఘట్టాలను తలపిస్తాయని వివరించారు. నిజాం సాగించిన పాలనకు చరమగీతం పాడుతూ, భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సమర్థ నాయకత్వంలో భారత సైన్యం 1948 సెప్టెంబర్ 13న 'ఆపరేషన్ పోలో' (పోలీస్ యాక్షన్) చేపట్టిందని తెలిపారు. కేవలం 5 రోజుల్లోనే (సెప్టెంబర్ 17, 1948న) నిజాం సైన్యం లోంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ లభించిందని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత మరియు జాతీయ భావాల వ్యాప్తి కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో కళాశాలల ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో ఏబీవీపీ దేవరకొండ నగర సంయుక్త కార్యదర్శి గుండాల శివరామరాజు, యలమల హేమసుందర్, సంతోష్, అబ్దుల్లా, సరఫరాజ్, డేవిడ్, మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


