వాడివేడిగా మర్రిగూడ మండల సర్వసభ్య సమావేశం!
- ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
- అధికారులు, ప్రజాప్రనిధుల మధ్య ఘాటు చర్చలు
- పలువురు అధికారుల గైర్హాజర్ పై సర్పంచుల తీవ్ర అసహనం
మర్రిగూడ, :మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నాడు నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడీగా సాగింది. మండల స్పెషల్ ఆఫీసర్ బి. వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ, గ్రామ సర్పంచులు మరియు వివిధ శాఖల అధికారులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులను ప్రభుత్వం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ఎకరానికి రూ. 30,000 చొప్పున రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు.మర్రిగూడలోని 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదించారు. గ్రామాల్లో ప్రాణాలకు ముప్పుగా మారుతున్న లూజ్ కరెంటు వైర్లను తక్షణమే సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.చర్లగూడ భూ నిర్వాసితుల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని కోరారు.
అధికారుల గైర్హాజర్ పై సర్పంచుల తీవ్ర అసహనం
సమావేశానికి ఫారెస్ట్ శాఖ అధికారులు, మర్రిగూడ 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు గైర్హాజరు కావడం పట్ల సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ప్రధాన అధికారులకు బదులుగా జూనియర్ అసిస్టెంట్లు, కింది స్థాయి సిబ్బంది హాజరుకావడంపై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించే కీలకమైన జనరల్ బాడీ సమావేశానికి ఇకపై బాధ్యతాయుతమైన అధికారులే విధిగా హాజరుకావాలని సర్పంచులు స్పష్టం చేశారు.
ఉపాధి హామీ పనులు, తాగునీటి భద్రతపై చర్చ
ఎల్ నినో ప్రభావంతో గ్రామాల్లో కూలీలకు పనిలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. వీబీజీ రాంజీ పథకం కింద వెంటనే ఉపాధి పనులు కల్పించాలని కోరారు.ఎల్ నినో పరిస్థితులరీత్యా రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.గ్రామాల్లో నిరంతరం ఎదురవుతున్న అనధికారిక కరెంటు కోతలు, విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ: ఎమ్మార్వో జక్కర్తి శ్రీనివాసులు
సమావేశంలో భాగంగా తహశీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు అనేది ఎప్పటికీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మర్రిగూడ స్పెషల్ ఆఫీసర్ బి. వేణుగోపాల్, ఎంపీడీవో జి.సి. మునయ్య, తహశీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు,ఎంపివో రవి కుమార్,వివిధ శాఖల అధికారులు,గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


