సీఎం ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సీఎం ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని, పైస్థాయిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులను వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 9వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాలకు సంబంధించిన గోడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. డీడబ్ల్యూవో వినూత్నతో కలిసి గోడప్రతులను ఆవిష్కరించిన ఆయన, పోషణ మాసం కార్యక్రమాలను అక్టోబర్ 8వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోషకాహారం, ఆరోగ్యం, మహిళలు, చిన్నారుల్లో పోషకాహారంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


