జలసాధన సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి.
పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా చైర్మన్ మొసలి శ్యాం ప్రసాద్ రెడ్డి
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ పట్టణంలోని గాంధీ పార్క్‌లో సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జలసాధన సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ చైర్మన్ మొసలి శ్యాం ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు నిర్వహిం చనున్న జలసాధన సత్యాగ్రహ దీక్షకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, రైతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులను ఆహ్వానించడం జరిగిందన్నారు.ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ సమస్య కాదని, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరి సమస్య అని ఆయన అన్నారు. పాలమూరు ప్రాంతానికి రావాల్సిన సాగునీటిని కాపాడుకోవడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయించుకోవడం కోసం ప్రజలందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నీటిని నల్లగొండ వైపు మళ్లించే విధంగా ఉన్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని, పాలమూరు ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చంద్రసాగర్–అమ్రాబాద్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలు జరిగితే పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, జిల్లాను సస్యశ్యామలం చేసే వరకు అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమిస్తామని మొసలి శ్యాం ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.కాబట్టి రేపు గాంధీ పార్క్‌లో నిర్వహించే జలసాధన సత్యాగ్రహ దీక్షకు రైతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


