లెంకలపల్లి మౌనిక మృతి కేసులో సంచలనం
- న్యాయం కోసం మర్రిగూడ పీఎస్ ఎదుట ధర్నా!
- కానిస్టేబుల్ కాళ్లు మొక్కిన బాధితురాలు..
- ప్రేమ కారణంతోనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య..
- 10 రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
నల్గొండ/మర్రిగూడ:సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వరికుప్పల మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. తన కూతురి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బాధితులు మరియు కుటుంబ సభ్యులు శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. పది రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నారు.మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల శ్రీను, శ్రీలత దంపతుల కుమార్తె మౌనిక సూర్యాపేటలో చదువుకుంటోంది. గతంలో జరిగిన రాఖీ పండుగ వేడుకల కోసం ఆమె స్వగ్రామానికి వచ్చింది.గ్రామానికి చెందిన ఓ యువకుడు కొద్దికాలంగా మౌనికను ప్రేమ పేరుతో తీవ్రంగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ వేధింపులు భరించలేక, ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి మౌనిక విగతజీవిగా వేలాడుతూ కనిపించింది.అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
పోలీసుల స్పందన, బాధితుల ఆవేదన
తండ్రి వరికుప్పల శ్రీను ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు ఇచ్చినా, పది రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితులను కస్టడీకి తీసుకోలేదని,అరెస్ట్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
మాకు న్యాయం చేయండి సార్.. కాళ్లు మొక్కుతా!
మాకు న్యాయం చేయండి సార్.. కాళ్లు మొక్కుతా అంటూ బాధిత మహిళలు పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యాలు అందరినీ కలచివేశాయి.న్యాయం జరిగే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ శుక్రవారం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని,రెండు రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
సంచలనం సృష్టిస్తున్న సుసైడ్ లెటర్
ఈ ఘటనలో మృతురాలు మౌనిక తన స్వహస్తాలతో రాసిన సూసైడ్ లెటర్ ప్రస్తుతం స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ లేఖలో వారి పేర్లు, వివరాలను ఆమె స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సూసైడ్ లెటరే ఈ కేసులో ప్రధాన ఆధారంగా మారనుందా అనేది తెలియాల్సి ఉంది.సూసైడ్ లెటర్‌లో పేరున్న వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని,నిష్పక్షపాతంగా విచారణను వేగవంతం చేసి బాధితులకు తక్షణ న్యాయం అందించాలని,విద్యార్థినిలు, యువతను వేధించే పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నాం :మర్రిగూడ ఎస్ఐ బి.రాంబాబు
మౌనిక తండ్రి వరికుప్పల శ్రీను ఫిర్యాదు మేరకు ఘటన జరిగిన రోజే కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అదే గ్రామానికి చెందిన రాకేష్ మరియు మైనర్ వ్యక్తులపై తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.మృతురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా అనుమానితులపై కేసు నమోదు చేయడం జరిగిందని,నిందితుడు రాకేష్‌కు,మౌనికకు మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని,ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని మర్రిగూడ ఎస్ఐ బి.రాంబాబు పేర్కొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


