యరుగండ్లపల్లిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
- స్వాతంత్ర్య వేడుకల్లో ప్రతిభకు ఘన సత్కారం
- దేశభక్తి స్ఫూర్తితో.. విద్యార్థుల భవిష్యత్తుకు బాట
-
ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం.. సంతోష్ యాదవ్ ప్రత్యేక చొరవ
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం :స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యరగండ్లపల్లి గ్రామంలో జెండా పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ, గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం విశేషంగా నిలిచింది. ముందుగా యరగండ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద, సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం యరగండ్లపల్లి హైస్కూల్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల సమక్షంలో ఆయన స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.దేశానికి స్వాతంత్ర్యం ఒక్కరోజులో వచ్చినది కాదని, దశాబ్దాల పాటు సాగిన పోరాటం, ఎన్నో త్యాగాలు, మరెన్నో కుటుంబాల కన్నీటి ఫలితంగానే, స్వేచ్ఛా భారతం ఆవిర్భవించిందని సర్పంచ్ సంతోష్ యాదవ్ అన్నారు. బ్రిటిష్ పాలనలో భారతీయులు అనేక రకాల అణచివేతలను ఎదుర్కొన్నారని, దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన, మహనీయుల పోరాటాలను నేటి తరం ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన తీరు, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి అనేక మంది వీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి, భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఆయన వివరించినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి దేశాభివృద్ధిలో భాగస్వామి కావడమే నిజమైన స్వాతంత్ర్య స్ఫూర్తి అని పేర్కొన్నారు.
--విద్యే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది
దేశ భవిష్యత్తు నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉందని సర్పంచ్ సంతోష్ యాదవ్ అన్నారు. విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యత, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవ లేదని, సరైన ప్రోత్సాహం లభిస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి ఎదగగలరని అన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలంలో ప్రథమ ర్యాంకు సాధించిన హైస్కూల్ విద్యార్థికి 10 వేల నగదు బహుమతి, ద్వితీయ ర్యాంకు సాధించిన విద్యార్థికి 5 వేల నగదు బహుమతి అందజేశారు. విద్యార్థుల కృషిని అభినందిస్తూ వారిని ఘనంగా సత్కరించారు. విద్యార్థుల్లో పోటీ తత్వం పెంచడంతో పాటు, చదువుపై మరింత ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో, ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని సర్పంచ్ సంతోష్ యాదవ్ ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులను గుర్తించి, తన వంతు నగదు ప్రోత్సాహకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని కేవలం జెండా ఎగురవేసే కార్యక్రమంగా కాకుండా, దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకునే రోజుగా, మన బాధ్యతలను గుర్తుచేసుకునే రోజుగా, మహనీయులు డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, గౌరవిస్తూ నడుచుకోవాలని అన్నారు. యువతలో దేశభక్తి, విద్యపై ఆసక్తి, సేవా భావం పెంపొందించడమే నిజమైన స్వాతంత్ర్య వేడుకలకు అర్థమని అన్నారు. యరగండ్లపల్లి గ్రామాభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులతో పాటు, విద్యకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా, గ్రామం నుంచి భవిష్యత్తులో మరింత మంది ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఒక విద్యార్థిని ప్రోత్సహించడం అంటే ఒక్క కుటుంబాన్నే కాదు.. ఒక తరం భవిష్యత్తును ప్రోత్సహించడమేనని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన, స్వాతంత్ర్య సమరయోధుల స్మరణతో కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఘనంగా ముగిసింది.
Views: 54
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
15 Aug 2026 15:37:34
బిజినపల్లి, :దేశ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బిజినపల్లి లోని ఆల్ సెన్స్ మోడల్ హై స్కూల్ లో అత్యంత ఘనంగా...
