ఆసుపత్రి ఉంది.. వైద్యం లేదు
కాలేజీలు లేవు.. ఉద్యోగాలు లేవు
హనుమకొండ , పరకాల: ఈనెల 16వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరకాలకు విచ్చేస్తున్న సందర్భంగా, పరకాల నియోజకవర్గంలో పరిష్కారం కాని ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. Dr. కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ పరకాలను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలి పరకాలను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పరకాలలో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు.ప్రస్తుతం ఉన్న పాలిటెక్నిక్ కాలేజీని అప్‌గ్రేడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజీగా మార్చాలని డిమాండ్ చేశారు. 2028 ఎన్నికల అనంతరం ప్రజల దీవెనలతో బీజేపీ అధికారంలోకి వస్తే పరకాలకు ఈ మూడు కీలక విద్యాసంస్థలను తీసుకురావడానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. 100 పడకల ఆసుపత్రి — ప్రజలకు పూర్తిస్థాయి వైద్యం ఎప్పుడు? పరకాలలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక వసతులు, పరీక్షలకు అవసరమైన రీఏజెంట్స్ అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రక్త పరీక్షల వంటి సాధారణ పరీక్షల కోసం కూడా వరంగల్‌కు పంపాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు కల్పించిన తర్వాతే ఆసుపత్రిని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఒక ప్రభుత్వం శంకుస్థాపన చేయడం, మరో ప్రభుత్వం ప్రారంభోత్సవం పేరుతో రాజకీయ ప్రచారం చేసుకోవడం కాకుండా, ఆసుపత్రి ప్రజలకు వాస్తవంగా ఉపయోగపడేలా పూర్తి స్థాయిలో సేవలు అందించాలని కోరారు. పరకాల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా పరకాల నియోజకవర్గ అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని బీజేపీ నాయకులు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, స్థానిక ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదేవిధంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన పరకాలను జిల్లాగా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నడికూడ మండలానికి కనీస సౌకర్యాలు కల్పించాలి నడికూడ మండలం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం బాధాకరమన్నారు. మండల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు. అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామమైన అక్కంపేటను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని గతంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేసి, అక్కడి ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా పరకాల అభివృద్ధిపై చర్చించాలి పరకాల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా స్థానిక మేధావులు, వైద్యులు, వ్యాపారులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేకు బీజేపీ నాయకులు సూచించారు.అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసి దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికతో పరకాలను ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ డిమాండ్ చేసింది.పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలి —డా. సిరంగి సంతోష్ కుమార్
బీజేపీ రాష్ట్ర నాయకులు డా. సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన పరకాలను అమరవీరుల జిల్లాగా ఏర్పాటు చేయడం పరకాల ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు. పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించే దిశగా ప్రభుత్వం, అధికారులపై బలమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని పరకాల అమరవీరుల జిల్లా జేఏసీ నాయకులు కలిసి పరకాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేసిన సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పుడు పరకాల జిల్లా ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందున, పరకాల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేలా పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించేందుకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని డా. సిరంగి సంతోష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరకాల చారిత్రక ప్రాధాన్యత, అమరవీరుల త్యాగాలను గుర్తించి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరడంతో పాటు పరకాల మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు.
సీఎం పర్యటనలో స్పష్టమైన హామీలు ఇవ్వాలి
ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈనెల 16న పరకాల పర్యటన సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించి, అభివృద్ధి పనులకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్.పి. జయంత్ లాల్, దేవునూరి మేఘనాథ్, పరకాల కౌన్సిలర్లు కుక్కల విజయ్, పూర్ణాచారి, ఆకుల శ్రీధర్, జిల్లా కోశాధికారి ఎర్ర రామన్న, రాష్ట్ర నాయకులు కాచం గురు ప్రసాద్, మండల అధ్యక్షులు ఎరుకల దివాకర్, కాసగాని రాజ్ కుమార్, ఉప్పుల శ్రీకాంత్ రెడ్డి, జాగీరపు రాంప్రసాద్, దేవరుప్పుల చంద్రమోహన్, లాదెల ప్రభాకర్, కొంగ రవి, పరకాల పట్టణ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, ప్రధాన కార్యదర్శులు సంగా పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి, దంచనాదుల కిరణ్, జిల్లా నాయకులు ఉడుత చిరంజీవి, దుబాసి కృష్ణ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య, మాజీ కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య, బాసాని సోమరాజు, దంచనాదుల సత్యనారాయణ, మెంతుల సురేష్, వెలిశెట్టి శారద, బూత్ అధ్యక్షులు పిట్ట కిషోర్, ముత్యాల దేవేందర్, బొచ్చు నరేందర్, రంతు, ప్రదీప్ రెడ్డి, శ్రవణ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


