అమాయకుల బియ్యాన్ని మింగేస్తున్న రేషన్ డీలర్?

అమాయకుల బియ్యాన్ని మింగేస్తున్న రేషన్ డీలర్?

  • మరణించిన వారి, పెళ్లైన కుమార్తెల పేర్లపై బియ్యం
  • నిలిపివేసి తనే కాజేస్తున్నాడని ఆరోపణలు 
  •  

దౌల్తాబాద్,సిద్దిపేట : దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి మదిర గ్రామపంచాయతీ పరిధిలోని శేరిల్ల గ్రామ రేషన్ దుకాణంలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయంటూ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కొత్తగా పెళ్లైన కుమార్తెల పేర్లపై వచ్చే బియ్యం, కుటుంబ సభ్యుడు మరణించిన తర్వాత కూడా కుటుంబానికి రావాల్సిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా రేషన్ డీలర్ తన వద్దే ఉంచుకుంటున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అమాయక ప్రజల అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఈ వ్యవహారం కొనసాగిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన మామిండ్ల నాగరాజు రేషన్ డీలర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లబ్ధిదారుల కథనం ప్రకారం, ఎవరైనా కుటుంబ సభ్యుడు మరణించినా లేదా ఇంట్లో కుమార్తె వివాహం జరిగి అత్తారింటికి వెళ్లినా, సంబంధిత కుటుంబానికి రావాల్సిన బియ్యాన్ని నిలిపివేస్తూ "పైనుంచి కట్ అయ్యాయి... ఇక మీకు రావు" అంటూ డీలర్ సమాధానం చెబుతున్నాడని ఆరోపిస్తున్నారు.
మరణించిన కుమారుడి బియ్యం నిలిపివేత?
శేరిల్ల గ్రామానికి చెందిన రేణుక కుమారుడు 2020లో మరణించాడు. అనంతరం కుటుంబ సభ్యులకు 2023 వరకు రేషన్ బియ్యం అందించిన డీలర్, ఆ తర్వాత 2023 నుంచి 2025 నవంబర్ వరకు రావాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. దీనిపై ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని వారు చెబుతున్నారు.
పెళ్లైన కుమార్తె పేరుతోనూ ఇదే పరిస్థితి
గ్రామానికి చెందిన పుష్పవ్వ కుమార్తెకు దాదాపు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత రెండు నెలలు మాత్రమే బియ్యం ఇచ్చి, అనంతరం నిలిపివేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కారణం అడగగా, "పెళ్లయిన తర్వాత బియ్యం రాదు... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి" అంటూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపించారు.
ప్రశ్నిస్తే బెదిరింపులే!
రేషన్ బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని అడిగిన లబ్ధిదారులకు "పైనుంచి కట్ అయ్యాయి", "ఇంకా మీకు వస్తాయా?", "ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి" అంటూ డీలర్ దబాయిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో చాలామంది నిరుపేద కుటుంబాలు భయంతో నోరు మెదపలేకపోతున్నాయని స్థానికులు అంటున్నారు.
సమగ్ర విచారణకు డిమాండ్
ఈ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం నిజంగా ఎవరికిచ్చారో, ఎక్కడికి వెళ్లిందో తేల్చి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Views: 408

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News