పొగడరా నీ తల్లి భూమి భారతిని

పొగడరా నీ తల్లి భూమి భారతిని

భారతమాత వైభవం నుంచి ఐకమత్య భారతం వరకు దేశభక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో నిండాలి
రచన: తరాల శివచరణ్ నాయుడు
స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక కథనం

  హైదరాబాద్ : ఇది నా భారత భూమి అని గర్వంగా చెప్పుకునే ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి నిరంతరం వెలుగుతూ ఉండాలి. మన దేశంలో అన్నీ ఉన్నప్పటికీ, ఏదో కోల్పోతున్నామనే అసంతృప్తి ఎందుకు కలుగుతోంది, మన దేశ గొప్పతనాన్ని ముందుగా మనమే గుర్తించాలి. మన మట్టిని, మన సంస్కృతిని, మన సంప్రదాయాలను గౌరవించాలి, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు పలికిన మాటలు ప్రతి భారతీయుడి గుండెల్లో నిత్యం ప్రతిధ్వనించాలి,
దేశానికి నిజమైన రక్షణ కవచం మన జవాన్లు:
ఎన్నో సవాళ్లు ఎదురైనా దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికుల ధైర్యం, త్యాగం, దేశభక్తి భారతదేశానికి అతి పెద్ద బలం. సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం నిలబడే ప్రతి జవాను గుండెల్లో భారతమాతపై ఉన్న అపారమైన ప్రేమే వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది, వారి త్యాగాల వల్లే మనం ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. అందుకే మన జవాన్లకు ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది,
భారతమాత అంటే కేవలం భూభాగం కాదు:
మనం భారతమాత బిడ్డలం అని గర్వంగా చెప్పుకున్న క్షణంలోనే మన ఒంటిలో రోమాలు నిక్క బొడుచుకోవాలి, తనువంతా దేశభక్తితో పులకించాలి. ఎందుకంటే భారతదేశం కేవలం ఒక భూభాగం కాదు, వేల సంవత్సరాల చరిత్రకు సంస్కృతికి, త్యాగానికి, పోరాటానికి ప్రతీక, మన ప్రాచీన సంస్కృతి, అపారమైన కళా సంపద, వైవిధ్య భరితమైన సంప్రదాయాలు, పచ్చని పంట పొలాలు, పరవళ్లు తొక్కే నదులు, అలలతో ఉప్పొంగే సముద్రాలు, ఎత్తైన పర్వతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం గొప్పతనానికి అంతే లేదు,
మువ్వన్నెల జెండా త్యాగాలకు ప్రతీక:
నింగిలో రెపరెపలాడే మువ్వన్నెల జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి ప్రతీక. ఆ జెండాను చూసిన ప్రతిసారీ మన పూర్వీకుల త్యాగాలు మనకు గుర్తుకు రావాలి, అది కేవలం ఒక జెండా కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలకు ప్రతీక. ఆ జెండా మనకు స్వేచ్ఛ విలువను, దేశం పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉండాలి,
భిన్నత్వంలో ఏకత్వమే భారత బలం:
కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు కానీ మనందరం భారతీయులం, వైవిధ్యంలో ఏకత్వమే భారతదేశానికి ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఆత్మీయతతో మెలుగుతూ, ప్రేమను పంచుకుంటూ ముందుకు సాగినప్పుడే భారత్ మరింత బలమైన దేశంగా ఎదుగుతుంది, దేశమంటే కేవలం భూభాగం కాదు, దేశమంటే మనుషులు. దేశమంటే మన మధ్య ఉన్న అనుబంధం. దేశమంటే పరస్పర గౌరవం, ఐకమత్యం, బాధ్యత,
విదేశాలకు వెళ్లినా మూలాలను మరవ కూడదు:
నేడు విదేశాల్లోనే అధిక సంపాదన, విలాస వంతమైన జీవితం ఉంటుందనే భావనతో కొందరు స్వదేశంపై మక్కువను కోల్పోతున్నారు, విదేశాలకు వెళ్లడం తప్పు కాదు, అభివృద్ధి కోసం ఎక్కడికి వెళ్లినా తప్పులేదు కానీ ఎక్కడ ఉన్నా మన మూలాలను, మన మట్టిని, మన సంస్కృతిని మరచి పోకూడదు, ప్రపంచం నలుమూలలా ఉన్నా మన గుండెల్లో భారతదేశం పట్ల గౌరవం ఎప్పటికీ నిలిచి ఉండాలి,
ఆడపిల్లకు భద్రత కల్పించినప్పుడే నిజమైన దేశభక్తి:
భారతమాత బిడ్డలుగా పుట్టిన ఆడపిల్లలపై హింసకు పాల్పడుతున్న మానవ రూపంలోని మృగాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది, ఆడపిల్లను గౌరవించే సమాజమే నిజమైన నాగరిక సమాజం, మహిళకు భద్రత, స్వేచ్ఛ, సమానత్వం కల్పించి నప్పుడే భారతమాతకు నిజమైన గౌరవం ఇచ్చినట్టవుతుంది, దేశభక్తి అంటే జెండాను గౌరవించడం మాత్రమే కాదు, దేశంలోని ప్రతి మహిళను, ప్రతి పౌరుడిని గౌరవించడం కూడా,
ప్రజాస్వామ్యంలో పౌరుడి బాధ్యత:
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు, రాజకీయాలు మాత్రమే కాదు. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అభివృద్ధి, బాధ్యతా యుతమైన పాలన, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి అసలైన అర్థాలు, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించకుండా, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే బాధ్యతాయుతమైన ప్రజా పరిపాలన అవసరం, అవినీతి, అన్యాయం, అసమానత, హింస వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి,
దేశాన్ని మార్చే శక్తి మనలోనే ఉంది:
దేశాన్ని మార్చే శక్తి కేవలం ప్రభుత్వాల చేతుల్లోనే లేదు. ప్రతి పౌరుడి ఆలోచనలో ఉంది, ప్రతి కుటుంబంలో ఉంది, ప్రతి యువకుడి చేతిలో ఉంది, ప్రతి ఓటు విలువలో ఉంది, మన ఆలోచన మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే దేశం మారుతుంది, అందుకే ఈ ఆగస్టు 15న మనం కేవలం జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించి, వేడుకలు జరుపు కోవడంతోనే ఆగి పోకూడదు, దేశం కోసం మనం ఏం చేస్తున్నాం, సమాజం కోసం మన బాధ్యత ఏమిటి, మన తరువాతి తరానికి ఎలాంటి భారతదేశాన్ని అందించాలి. అనే ప్రశ్నలను మనల్ని మనమే అడగాలి,
భారతమాత గర్వించే పౌరులుగా జీవిద్దాం:
భారతమాతను పొగడటమే కాదు భారతమాత గర్వించే పౌరులుగా జీవిద్దాం, మన మట్టి మన గౌరవం, మన సంస్కృతి మన సంపద, మన సైనికుల త్యాగం మన స్ఫూర్తి మన ఐకమత్యం మన మహాబలం, మన భారతదేశమే మన గర్వం,
పొగడరా పొగడరా నీ తల్లి భూమి భారతిని జై హింద్  జై భారత్
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News