ఖర్గే సభా వేదిక శుద్ధి ప్రజాస్వామ్యానికి మచ్చ

• జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి

ఖర్గే సభా వేదిక శుద్ధి ప్రజాస్వామ్యానికి మచ్చ

దౌల్తాబాద్,సిద్దిపేట: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ నిర్వహించిన అనంతరం సభా వేదికను శుద్ధి చేయడం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి తీవ్రంగా ఖండించారు. ఈ నెల 8న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్దానీ రామ్‌లీల గ్రౌండ్‌లో ఖర్గే ప్రసంగించిన అనంతరం బీజేపీ అనుబంధ వర్గాలు ఆ ప్రదేశం అపవిత్రమైందంటూ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గణేష్ పంచమి మాట్లాడుతూ, ఖర్గే ప్రసంగానికి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారని, ఆయన తన ప్రసంగంలో ఎక్కడా కులం లేదా మతం పేరుతో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రజల సమస్యలు, దేశ రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలనే ప్రస్తావించారని తెలిపారు. అలాంటి నాయకుడు ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం ద్వారా ఆయనను మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను అవమానించినట్లేనని విమర్శించారు.ఇలాంటి చర్యలు దేశంలో సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు ఉండొచ్చుగానీ వ్యక్తులను కించపరిచే చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కావని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హల్దానీ సభా వేదికను శుద్ధి చేసిన వారిపై అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని గణేష్ పంచమి ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి సంఘటనలు దేశ ఐక్యతకు, సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తాయని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News