బోధన్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు దురదృష్టకరం
- వెంటనే క్షమాపణ చెప్పాలని సీఐటీయూ డిమాండ్
- చిన్నంబావిలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశం
చిన్నంబావి, : గ్రామపంచాయతీ కార్మికులు, కారోబార్లపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, కార్మికులకు క్షమాపణ చెప్పాలని సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎన్.రమేష్ డిమాండ్ చేశారు. చిన్నంబావి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) మండల అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో నాయకుల ముఖ్య సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎన్.రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము మాట్లాడారు. ఈ నెల 24న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి గ్రామపంచాయతీ కార్మికుల వల్లనే గ్రామాల అభివృద్ధి ఆగిపోయిందని, వీళ్ల వల్లే గ్రామాలు చెడిపోతున్నాయని మాట్లాడటం సరైనది కాదన్నారు. 1981 నుంచే కారోబార్లు నెలకు రూ.100 నుంచి రూ.200 అతిస్వల్ప వేతనంతో రికార్డుల నిర్వహణ, పన్నుల వసూళ్లు, రెవెన్యూ సేవలు, ఇందిరమ్మ సర్వేలు, ఓటరు నమోదుతో పాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ గ్రామాల ప్రగతికి పునాదిగా నిలిచే శ్రామికులను అవమానించడం ఒక ప్రజాప్రతినిధికి తగదని హితవు పలికారు.
ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలో ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకుడు అత్తర్ పాషా, నాయకులు మాషయ్య, అలివేలమ్మ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


