దెందుకూరులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
- ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయి
- ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందాలి
- సర్పంచ్ పగిడిపల్లి శ్రీనివాసరావు
- సాంకేతికతతో పెరగనున్న పారదర్శకత.. హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు
మధిర : సమాజంలోని ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని దెందుకూరు గ్రామ సర్పంచ్ పగిడిపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సర్పంచ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక సాంకేతికతతో రూపొందించిన స్మార్ట్ కార్డులను అందించడం వల్ల నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్నారు.ఈ నూతన విధానంతో అవకతవకలకు తావులేకుండా అర్హులకు వేగంగా, సులభంగా రేషన్ సరుకులు అందుతాయని తెలిపారు.రేషన్ కార్డు కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే పరిమితం కాదని,ప్రభుత్వ పథకాల లబ్ధితో పాటు ఆరోగ్య భద్రతకు అదొక ప్రామాణికమైన ఆధారం అని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలిచాయని కొనియాడారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలుస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు వయోవృద్ధులు, వికలాంగుల కు అందిస్తున్న పింఛన్లు పేద కుటుంబాల్లో నింపుతున్న ధైర్యాన్ని గుర్తుచేశారు.దెందుకూరు పరిధిలో అర్హత ఉన్న ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా తమ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారుల చేతికి అందటం లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్,పంచాయతీ కార్యదర్శి భాస్కర్,వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఊట్ల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితం ప్రసాద్,రాయల్ ప్రసాద్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


