37 ఏళ్ల విశిష్ట సేవలకు ఘన సన్మానం
పదవీ విరమణ సందర్భంగా ఇద్దరు సింగరేణి జనరల్ మేనేజర్లకు సత్కారం
కొత్తగూడెం, : ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జీఎం (పర్సనల్/ఐఆర్‌పీఎం) కవితా నాయుడు, జీఎం (ఈ అండ్ ఎం), సెంట్రల్ వర్క్‌షాప్ దామోదరరావులకు కొత్తగూడెం ఏరియా జీఎం ఎం. షాలేం రాజు ఆధ్వర్యంలో శనివారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఇద్దరు అధికారులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జీఎం ఎం. షాలేం రాజు మాట్లాడుతూ, కవితా నాయుడు, దామోదరరావు దాదాపు 37 సంవత్సరాల పాటు సింగరేణి సంస్థకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, సమర్థవంతమైన పరిపాలనలో వారు చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారి నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు సంస్థకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. వారి సేవలు సింగరేణి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొంటూ, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.సన్మానం అందుకున్న కవితా నాయుడు, దామోదరరావు మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో సేవలందించే అవకాశం దక్కడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో సహకరించిన యాజమాన్యం, అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణిలో గడిపిన సేవా కాలం జీవితాంతం మరపురాని అనుభూతిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ టు జీఎం ఎం. గోవిందరావు, వికెసీఎం ప్రాజెక్టు ఆఫీసర్ ఎం.వి. నరసింహరావు, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, ఏజీఎం (ఫైనాన్స్) బిబత్స, డీజీఎం (ఐఈడీ) యోహన్, సీఎంఓఏఐ జనరల్ సెక్రటరీ ఉపేందర్, ఇన్‌చార్జ్ హెచ్‌వోడీ (సివిల్) కె. రాజారాం, ఏరియా ఎస్టేట్స్ ఆఫీసర్ బి. తౌర్య, డీజీఎం (ఈ అండ్ ఎం) క్రిస్టోఫర్, మేనేజర్ (ఐటీ) శేష శ్రీ, డీవైపీఎం హరీష్, సీనియర్ పీఓ మజ్జి మురళి తదితర అధికారులు, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ఇద్దరు జనరల్ మేనేజర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


