ఎల్‌నినో ప్రభావంపై రైతులకు కీలక సూచనలు
- పట్లూర్ రైతు వేదికలో అవగాహన సదస్సు
- 50 శాతం వర్షపాతం లోటు: శాస్త్రవేత్తల హెచ్చరిక
మర్పల్లి, (వికారాబాద్ ): వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని పట్లూర్ రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజేశ్వర్ రెడ్డి , మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది మండలంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 50 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులు పంటల ఎంపిక నుంచి నీటి వినియోగం వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సదస్సులో రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వివరించారు. ఈ పరిస్థితుల్లో తక్కువ కాల వ్యవధిలో పండే, తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయడం మంచిదన్నారు. అలాగే నేల తేమను సంరక్షించడం, సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా నష్టాలను తగ్గించవచ్చని సూచించారు.పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటల్లో ఆశించే ప్రధాన చీడపీడలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు, సమగ్ర చీడపీడల యాజమాన్యంపై రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు. వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.మండల వ్యవసాయ అధికారి కె. శ్రీకాంత్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలను రైతులు అనుసరించాలని కోరారు. కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు నానో డీఏపీ వినియోగం, దాని ప్రయోజనాలు, పంటల్లో సరైన వినియోగ విధానాన్ని రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సంగీత, పట్లూర్ సర్పంచ్ పరుశురాం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ యాదవ్, ఉపసర్పంచ్, రాంపూర్ సర్పంచ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Views: 47
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
