కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు మానుకోవాలి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి రెండు నాలుకల ధోరణితో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్‌డీఎస్‌ఏ సమాధానంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం బట్టబయలైందని అన్నారు. మేడిగడ్డ అన్ని అనుమతులతో నిర్మించిన బ్యారేజ్ అని, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదని, 16 రిజర్వాయర్లకు జీవనాధారమైన సమగ్ర ఎత్తిపోతల ప్రాజెక్టు అని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాలను వినియోగించకుండా ఇప్పటికే 105 టీఎంసీలకు పైగా నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనిచ్చారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపించారు. కేసీఆర్ పేరు చెరిపివేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఎన్‌డీఎస్‌ఏ నివేదిక కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటిదని అన్నారు. రైతులకు నీరు అందించడంలో కడియం శ్రీహరి పూర్తిగా విఫలమయ్యారని, దేవాదుల ప్రాజెక్టు, ఉప్పుగల్ పాలకుర్తి కాలువ, లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ద్వారా 1.53 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, ఏడు రిజర్వాయర్లతో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశామని అన్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, కడియం శ్రీహరి కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. రాజకీయ విమర్శలు హుందాగా చేయాలని నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని రాజయ్య హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ పొన్న రాజేష్, బీఆర్ఎస్ నేతలు మాచర్ల గణేష్, కనకం గణేష్, చల్లా చందర్ రెడ్డి, కర్ర సోమిరెడ్డి, బత్తుల రాజన్ బాబు, ఆకారపు అశోక్, కుంభం కుమార్, హీరాసింగ్, గట్టు కృష్ణసాయి, నాగపురి పావని, మరేడుపాక రామాదేవి తదితరులు పాల్గొన్నారు.
Views: 56
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
