ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.
- అధికారుల సూచనలు పాటించకుండా
- వరి సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం.
- పెద్దపల్లి జిల్లాలో వేగంగా అభివృద్ధి పనులు...
- త్వరలో ఓదెలలో నూతన కోర్టు భవన నిర్మాణం..
- భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా దశలవారీగా భూ పునఃసర్వె.. జిల్లా కలెక్టర్
- పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 23 గ్రామాల్లో భూ పునఃసర్వే ప్రారంభం..
- రైతులు పూర్తి సహకారం అందించాలి..
- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణా రావు
పెద్దపల్లి ఓదెల,: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో శనివారం 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు,పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష ప్రారంభించారు. నూతన తహశీల్దార్ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు కు తహశీల్దార్ వనజా నాయక్ ఘనంగా స్వాగతం పలికారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను నివారించుకోవాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణరావు రైతులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు విజయరమణా రావు మాట్లాడుతూ... జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని,విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల గవర్నర్,ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్ ను అభినందించారు.కొన్ని నెలల క్రితం కాల్వశ్రీరాంపూర్ లో నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించామని,నేడు ఓదెల తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.గత రెండున్నర సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఓదెలలో కోర్టు మంజూరైందని, త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణాన్ని చేపడతామన్నారు. జిల్లాలో డబుల్ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని,పొత్కపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు.గత ఏడాది కాల్వశ్రీరాంపూర్,ఓదెల మండలలాల్లోని టెయిల్ ఎండ్ ప్రాంతాలకు సాగునీరు అందించగలిగామన్నారు.గత సీజన్‌లో అధిక వర్షాలు కురిసిన సమయంలో రానున్న సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి చెరువులను నింపాలని అధికారులకు సూచించామని,ఆ సమయంలో తీసుకున్న చర్యల వల్లే ప్రస్తుతం ఈ మండలాల్లో కొంత మేర నీరు అందుబాటులో ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలను చూసి నీటి సమస్య ఉండదనే అపోహలో రైతులు ఉండవద్దని సూచించారు. ఒక ఎకరం వరి సాగుకు వినియోగించే నీటితో నాలుగు ఎకరాల్లో కందులు,మొక్కజొన్న,చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు, ఆయిల్ పామ్ లాంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి రైతులు అధిక లాభాలు ఘటించవచ్చన్నారు.కందుల కు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని,నాలుగు నెలల్లోనే పంట చేతికి వస్తుందని, వీటికి క్వింటాల్ కు సుమారు 10 వేల రూపాయల వరకు ధర లభిస్తోందన్నారు.ఆగస్టు నెలలో నువ్వుల పంట సాగు చేపట్టవచ్చని, వాటికి క్వింటాల్‌కు సుమారు రూ.9 వేల వరకు మార్కెట్ ధర లభిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని,ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయన్నారు.వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలనే సాగు చేయాలని,వారి సూచనలు పాటించకుండా అధిక నీటి అవసరమయ్యే పంటలు సాగు చేస్తే రానున్న రోజుల్లో నీటి కొరత కారణంగా పంటలను కాపాడుకోవడం రైతులకు చాలా కష్టమవుతుందని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లాకు వంద ఎకరాలకు కూడా సాగునీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. కొందరు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. ఇప్పటికైనా ఈ సీజన్ లో మంచి వర్షాలు కురవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని, ప్రతి రైతు పరిస్థితులను అర్థం చేసుకుని జాగ్రత్తగా పంటల ఎంపిక చేసుకోవాలని కోరారు.సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్లో మంచి ధరలు లభించే అవకాశముందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ప్రతి ఎకరానికి రూ.6 వేల రైతు భరోసా అందిస్తున్నామన్నారు.ఇటీవల తొమ్మిది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.వరి కొనుగోళ్లలో క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.గత రెండేళ్లలో ఓదెల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 5.5 కోట్ల రూపాయల నిధులు వెచ్చించామన్నారు. గతంలో పాఠశాలల్లో ప్రహరీ గోడలు,మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి ఉండేదని,ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల లలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.గతంలో నెలకు కేవలం 30 నుంచి 40 ప్రసవాలు మాత్రమే జరిగేవని, ప్రస్తుతం నెలకు సుమారు 250 ప్రసవాలు జరుగుతున్నాయన్నారు.53 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి మరో రెండు నెలల్లో ప్రారంభానికి సిద్ధం కానుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని,ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం దశలవారీగా భూ పునఃసర్వే చేపట్టిందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్వహించిన పునఃసర్వే ద్వారా వచ్చిన అనుభవాల ఆధారంగా ప్రస్తుతం ప్రతి జిల్లాలో మొదటి దశలో 70 గ్రామాల్లో భూ పునఃసర్వే చేపడుతున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 23 గ్రామాల్లో భూ పునఃసర్వే ప్రారంభించామన్నారు.ముందుగా గ్రామ సరిహద్దులను ఖరారు చేసి,అనంతరం ఆధునిక సాంకేతిక పరికరాలతో భూముల సర్వే నిర్వహిస్తామని తెలిపారు.సర్వే పూర్తయిన అనంతరం రైతులకు పూర్తి వివరాలు తెలియజేసి,అభ్యంతరాలు స్వీకరించి,వాటిని పరిశీలించి అవసరమైన సవరణలు చేసిన తర్వాతే తుది భూ వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తామని తెలిపారు.ఈ భూ పునఃసర్వే ద్వారా దాదాపు 99 శాతం భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, రైతులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయన్నారు.రైతులు వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు.గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలాలు సుమారు 2.5 మీటర్ల మేర తగ్గాయన్నారు.నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గి విద్యుత్ సరఫరాపై ప్రభావం పడుతోందన్నారు.గ్రామాల్లోని చెరువుల్లో ప్రస్తుతం కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని, అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని రైతులకు సూచించారు. రైతులు మొక్కజొన్న,ఆయిల్‌పామ్,కందులు, పెసర్లు,చిరుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని,జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ కూడా ఏర్పాటు కానున్న నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల సాగు చేపట్టాలని,భూమిని ఖాళీగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. తహశీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు తో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మొక్కలను నాటి, "జలసిరి" పోస్టర్ ను ఆవిష్కరించారు. నూతన తహశీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములు,తహశీల్దార్ వనజ నాయక్,ఎంపీడీవో అనిల్ రెడ్డి,సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


