ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

రైతులకు డా. కె. అరుణ సూచనలు

ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

మండలం కేంద్రంలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. కె. అరుణ సూచించారు.
ఆమె మాట్లాడుతూ, తేలికపాటి నేలల్లో సజ్జ–కంది పంటలను 2:1 వరుసల నిష్పత్తిలో, బరువైన నేలల్లో 4:1 వరుసల నిష్పత్తిలో జూలై 31వ తేదీలోపు విత్తుకోవాలని తెలిపారు. అలాగే స్వల్పకాలిక కంది రకాలను తేలికపాటి, బరువైన నేలల్లో ఆగస్టు 15వ తేదీలోపు సాగు చేయవచ్చని రైతులకు సూచించారు.
వరి పంటకు సూచనలు:
వరి నాట్లు వేయడానికి వారం రోజుల ముందు ఎకరానికి సరిపడే నారుమడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఇసుకతో కలిపి సమానంగా చల్లాలని తెలిపారు. కాండం తొలిచే పురుగు అధికంగా ఆశించే ప్రాంతాల్లో నాటిన 15 రోజుల తర్వాత ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేయాలని సూచించారు.
పత్తి పంటలో జాగ్రత్తలు:
ప్రస్తుత వాతావరణం రసం పీల్చే పురుగుల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున, ముందస్తు నివారణ చర్యగా ఇమిడాక్లోప్రిడ్ లేదా ఫ్లోనికామిడ్ మందులను నీటితో 1:20 నిష్పత్తిలో కలిపి, పంట 30, 45 రోజుల దశలో కాండంపై పూసే (స్టెమ్ అప్లికేషన్) విధానంలో ఉపయోగించాలని తెలిపారు.
కంది పంటకు సూచనలు:
ప్రత్యామ్నాయ పంటగా కందిని సాగు చేయదలచిన రైతులు ఆగస్టు 15వ తేదీలోపు తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే రకాలను ఎంపిక చేసుకుని విత్తుకోవాలని సూచించారు. అధిక దిగుబడి కోసం సిఫార్సు చేసిన మొక్కల మధ్య దూరాన్ని పాటించాలని తెలిపారు. భారీ నేలల్లో 90 × 20 సెం.మీ., తేలికపాటి నేలల్లో 45–60 × 20 సెం.మీ. దూరం ఉండేలా సాగు చేయాలని పేర్కొన్నారు.
సోయాచిక్కుడు పంటలో పురుగు నివారణ:
ప్రస్తుత పొడి వాతావరణం పొగాకు లద్దె పురుగు వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున, రైతులు పంటను తరచూ పరిశీలించి ప్రారంభ దశలోనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నివారణ కోసం నోవల్యూరాన్ (1 మి.లీ./లీటరు) లేదా క్లోరోపైరిఫాస్ 20% EC (2.5 మి.లీ./లీటరు) లేదా థయోడికార్బ్ (1.5 గ్రాములు/లీటరు) మందులలో ఏదో ఒకదాన్ని సిఫార్సు చేసిన మోతాదులో పిచికారీ చేయాలని తెలిపారు.పురుగుమందుల పిచికారీని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో, వ్యవసాయ శాఖ సూచించిన మోతాదులను పాటిస్తూ నిర్వహిస్తే పంటలకు మెరుగైన రక్షణ లభిస్తుందని డా. కె. అరుణ రైతులకు సూచించారు.
 
 
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News