ప్రజల మన్ననలు పొందేలా సేవలందించాలి: జిల్లా ఎస్పీ
- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
- పోలీసు సిబ్బంది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
- వీక్లీ పరేడ్‌లో డ్రిల్స్ పరిశీలించిన ఎస్పీ
రాజన్నసిరిసిల్ల : ప్రజల విశ్వాసాన్ని సంపాదించడంలో క్రమశిక్షణ, నిబద్ధత, బాధ్యతాయుత సేవలే పోలీసు శాఖకు నిజమైన గుర్తింపని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మహేష్ బి. గితే పేర్కొన్నారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా ఉంటూ చట్ట అమలులో నిష్పాక్షికత, సేవాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీస్, హోం గార్డ్ సిబ్బందికి నిర్వహించిన వారాంతపు పరేడ్‌కు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్‌లను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం అత్యంత అవసరమన్నారు. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు నడవడం లేదా వ్యాయామం చేయడం, బయట ఆహారానికి దూరంగా ఉండడం, సమయానుకూలంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన పోలీసు వ్యవస్థే సమర్థవంతమైన ప్రజాసేవకు బాటలు వేస్తుందని అన్నారు. వీక్లీ పరేడ్ ద్వారా క్రమశిక్షణ, సమన్వయం, ఐక్యత, శారీరక దృఢత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. పరేడ్‌లో నేర్చుకునే నైపుణ్యాలు రోజువారీ విధుల నిర్వహణలో ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ, సిబ్బందికి వ్యక్తిగతంగా లేదా విధులకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పుడైనా తనను నేరుగా కలిసి తెలియజేయవచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మధుకర్, సురేష్, రమేష్, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు రాజు, శ్రవణ్ యాదవ్, దిలీప్, సాయి కిరణ్‌తో పాటు జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీసు, హోం గార్డ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
