పోలీస్ అక్క కార్యక్రమంపై మహిళా పోలీసులకు ఎస్పీ అవగాహన

మహిళలు, బాలికల భద్రతకు సమర్థవంతంగా అమలు చేయాలని సూచన

పోలీస్ అక్క కార్యక్రమంపై మహిళా పోలీసులకు ఎస్పీ అవగాహన

కొత్తగూడెం :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో చేపట్టనున్న"పోలీస్ అక్క" కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ మహిళా పోలీసు సిబ్బందికి సూచించారు.శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నియమితులైన మహిళా కానిస్టేబుళ్లు "పోలీస్ అక్క"లుగా విద్యాసంస్థలను క్రమం తప్పకుండా సందర్శించాలని తెలిపారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించేలా వ్యవహరించాలని సూచించారు.విద్యార్థులకు మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్, బుల్లీయింగ్, ఈవ్ టీజింగ్, స్టాకింగ్, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి సమస్యనైనా నిర్భయంగా పోలీసులకు తెలియజేసేలా విశ్వాసాన్ని పెంపొందించడం "పోలీస్ అక్క"ల ప్రధాన బాధ్యత అని తెలిపారు.అలాగే, ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత షీ టీమ్, ఎస్‌హెచ్‌ఓలకు సమాచారం అందించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మహిళా పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు. జిల్లాలో "పోలీస్ అక్క" కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా మహిళలు, బాలికలకు మరింత భద్రతా భరోసా కల్పించవచ్చని ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, షీ టీమ్ ఎస్‌హెచ్‌ఓ రమాదేవి, మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News