ప్రభుత్వ ఉద్యోగులకు 17% హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ అమలు చేయాలి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే అర్హత కలిగిన పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ), సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ (సీసీఏ)ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, మహబూబ్‌నగర్ జిల్లా శాఖ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, జి.ఓ.(పీ) నెం.225, తేదీ 29-05-1993 మరియు జి.ఓ.ఎంఎస్. నెం.54, తేదీ 11-06-2021 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, కార్పొరేషన్ పరిమితులకు 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అర్హత గల ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ, ఇప్పటికీ పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదని, దీంతో వారు నష్టపోతున్నారని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసి, అర్హులైన ఉద్యోగులందరికీ వెంటనే 17 శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. విజయకుమార్, ప్రధాన కార్యదర్శి డా. బాలు యాదవ్ బైకాని, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు యాదగిరి, ఉపాధ్యక్షులు విజయకుమారి, తానాజీ చౌహాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధర్, జాయింట్ సెక్రటరీ నరేష్, మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మణ్ సింగ్, ఉషారాణి, నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


