మా పొలాలు ఇచ్చాం..మట్టినైనా వదిలేయండి..

మా పొలాలు ఇచ్చాం..మట్టినైనా వదిలేయండి..

  • రైతుల ఆవేదనకు భట్టి విక్రమార్క స్పందించాలని విజ్ఞప్తి.
  • రైతు ఆశీర్వాద సభతో పొలాలే దెబ్బతిన్నాయంటున్న రైతులు
  • గుంతలు పూడ్చుకొనే మట్టినీ తరలిస్తే ఎలా అని ప్రశ్న.
  • టెంట్ల కోసం తీసిన గుంతలు... రైతుల్లో కొత్త ఆందోళన.
  • వర్షాలు వస్తే పొలాలు మరింత దెబ్బతింటాయంటున్న రైతులు..
 

 చింతకాని : మత్కేపల్లి క్రాస్‌రోడ్‌లో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ కోసం జగన్నాధపురం గ్రామానికి చెందిన పలువురు రైతుల వ్యవసాయ పొలాలను లీజుకు తీసుకున్నట్లు స్థానిక రైతులు తెలిపారు. సభ ముగిసిన అనంతరం తమ పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ లారీలు, జేసీబీలు, ఇతర యంత్రాలు పొలాల్లో తిరగడంతో భూమిలో గుంతలు, బీటలు ఏర్పడి సాగుకు అనువుగా లేకుండా పోయిందని వాపోతున్నారు. రానున్న పంట సీజన్‌లో పంటలు ఆశించిన స్థాయిలో పండుతాయో లేదోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేసిన గచ్చును ఇప్పటికీ తొలగించలేదని, అయితే సభ ఏర్పాట్ల కోసం తీసుకొచ్చిన మట్టిని మాత్రం కాంట్రాక్టర్ తన స్వలాభం కోసం ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ మట్టిని పొలాల్లోనే ఉంచితే వాహనాలు తిరిగిన కారణంగా ఏర్పడిన గుంతలను పూడ్చుకొని, భూమిని తిరిగి చదును చేసుకొని సాగుకు అనువుగా మార్చుకోవచ్చని తాము పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సభ కోసం టెంట్లు ఏర్పాటు చేసే సమయంలో గుంజలు పాతేందుకు అనేక చోట్ల గుంతలు తవ్వారని, కార్యక్రమం ముగిసిన తర్వాత వాటిని పూడ్చకుండా వదిలేయడంతో వర్షాలు కురిస్తే ఆ గుంతలు మరింత పెద్దవిగా మారి పొలాలు సాగుకు అనుకూలంగా ఉండవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద జేసీబీలను పొలాల్లోకి దించి ఇష్టానుసారంగా తిప్పడం వల్ల భూమి మరింత దెబ్బతింటోందని రైతులు చెబుతున్నారు. పొలాలను లీజుకు తీసుకున్న సమయంలో ఇస్తామని చెప్పిన కౌలు సొమ్ము కూడా ఇప్పటివరకు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కోసం నిర్వహించిన సభ వల్ల రైతులే నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సభ కోసం తీసుకొచ్చిన మట్టిని పొలాల్లోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న పొలాలను పునరుద్ధరించాలని, లీజుకు సంబంధించిన కౌలు సొమ్మును వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని జగన్నాధపురం గ్రామ రైతులు వేడుకుంటున్నారు.
Views: 168

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News