బి.సి. మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం
మహబూబ్ నగర్ : బి.సి.మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, వారి ఆర్థిక సాధికారతను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విష్ణు నందన్ తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన బీసీ మహిళలకు కుట్టు మిషన్లు అందించి, ఇంటి వద్దనే కుట్టుపని చేసుకుంటూ స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు. పథకానికి అర్హత కలిగిన బీసీ మహిళల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 13 వరకు కొనసాగుతుందని, అర్హులైన బీసీ మహిళలు నిర్దేశిత గడువులోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు సమయంలో అవసరమైన వివరాలను సక్రమంగా నమోదు చేసి, నిర్దేశిత గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన బీసీ మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందడంతో పాటు కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని విష్ణు నందన్ కోరారు. పథకానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


