చట్టాలను పాఠశాల స్థాయి పాఠ్యాంశాలలో చేర్చాలి

భారత చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి తరాల: శివ చరణ్ నాయుడు

చట్టాలను పాఠశాల స్థాయి పాఠ్యాంశాలలో చేర్చాలి

హైదరాబాద్  : గతవారం పాఠశాల ప్రిన్సిపాల్‌ను పదో తరగతి విద్యార్థులు హత్య చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విద్యార్థుల చేతుల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా యువతలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం పెరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మత్తు పదార్థాల సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టడంతో పాటు, పిల్లలకు చిన్న వయసు నుంచే చట్టాలపై అవగాహన కల్పించాలి.మన మారుతున్న జీవనశైలిని ఒకసారి పరిశీలిస్తే, గత 30 సంవత్సరాలతో పోలిస్తే నేటి సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో కుటుంబాల్లో మానవత్వం, ప్రేమ, ఆప్యాయతలు, బంధుత్వాలకు ఎంతో విలువ ఉండేది. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా మనిషి విలువలు, కుటుంబ బంధాలు, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలిచే మనస్తత్వం ఉండేది.ఆ రోజుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాలు విస్తృతంగా అందుబాటులో లేకపోయినా మనుషుల మధ్య సంబంధాలు బలంగా ఉండేవి. కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగుపొరుగు వారి మధ్య అనుబంధం ఎక్కువగా ఉండేది. సమస్య వచ్చినప్పుడు కలిసి పరిష్కరించుకునే సహనం, సంయమనం ఉండేది.కానీ నేడు మారుతున్న జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానం విస్తరణ, సామాజిక మాధ్యమాల ప్రభావంతో పిల్లల ఆలోచనా విధానంలో కూడా వేగంగా మార్పులు వస్తున్నాయి. చిన్న వయసులోనే వివిధ రకాల సమాచారాన్ని వారు మొబైల్ ఫోన్లు, సినిమాలు, సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసు కుంటున్నారు, అందులో మంచి విషయాలతో పాటు హింస, మత్తు పదార్థాలు, నేరాలు వంటి ప్రతికూల అంశాలు కూడా వారి దృష్టికి వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పిల్లలకు చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. తమ హక్కులు ఏమిటి, తమ బాధ్యతలు ఏమిటి, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, నేరం అంటే ఏమిటి, ఇతరుల హక్కులను గౌరవించడం ఎందుకు అవసరం, వంటి విషయాలను చిన్న వయసులోనే వారికి అర్థమయ్యే విధంగా బోధించాలి.అందుకే పాఠశాల స్థాయి నుంచే ప్రాథమిక చట్టాలపై అవగాహన కల్పించే ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రవేశ పెట్టాలి. విద్యార్థుల వయసుకు అనుగుణంగా రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులు బాధ్యతలు, బాలల రక్షణ చట్టాలు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, నేరాలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలు వంటి అంశాలను బోధించాలి. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును ఎలా నాశనం చేస్తాయో, వాటి వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో విద్యార్థులకు స్పష్టంగా వివరించాలి. పాఠశాలలు, తల్లిదండ్రులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తేనే ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోగలం. చట్టంపై విద్యార్థుల్లో భయం కంటే గౌరవం, బాధ్యత పెరగాలి. చట్టం ప్రతి ఒక్కరికీ సమానమనే భావన చిన్నతనం నుంచే కలగాలి. నైతిక విలువలు, మానవత్వం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో పాటు చట్టపరమైన అవగాహన కూడా విద్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారాలి. రేపటి సమాజాన్ని నిర్మించేది నేటి పిల్లలే. వారిని కేవలం మంచి విద్యార్థులుగా కాకుండా మంచి మనుషులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలపై ఉంది. పాఠశాల స్థాయిలోనే చట్టాలపై అవగాహన కల్పిస్తే విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెరుగుతుంది. నేరాల వైపు వెళ్లకుండా ముందుగానే వారిని అప్రమత్తం చేయవచ్చు. ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించవచ్చు. తద్వారా భవిష్యత్తులో హింసాత్మక ఘటనలు, నేరప్రవృత్తులు తగ్గించేందుకు ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి పాఠశాల స్థాయి పాఠ్యాంశాలలో ప్రాథమిక చట్టపరమైన అవగాహనకు ప్రత్యేక స్థానం కల్పించాలి. ప్రతి పాఠశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన అవగాహన సదస్సులు నిర్వహించాలి. పిల్లల చేతుల్లో పుస్తకం ఉండాలి మత్తు పదార్థం కాదు, వారి మనసుల్లో హింస కాదు మానవత్వం ఉండాలి, చట్టాన్ని ఉల్లంఘించే ధైర్యం కాదు, చట్టాన్ని గౌరవించే బాధ్యత ఉండాలి, అప్పుడే ఆరోగ్యకరమైన, బాధ్యతా యుతమైన సమాజాన్ని నిర్మించగలం
Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన