టీజీఎస్పీడీసీఎల్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించిన SERP సీఈఓ దివ్య దేవరాజన్
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సీఈఓ శ్రీమతి దివ్య దేవరాజన్, IAS మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లోని కిచెన్, డిష్ వాషింగ్ ప్రాంతం, స్టోర్ రూమ్ యూనిట్, పరిశుభ్రత ప్రమాణాలు, ఇతర సదుపాయాలను ఆమె పరిశీలించారు.మహిళా సంఘాల సాధికారతకు ప్రోత్సాహం అందించే దిశగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, IAS తీసుకున్న ప్రత్యేక చొరవను దివ్య దేవరాజన్ అభినందించారు. క్యాంటీన్ నిర్వహణలో భాగస్వామ్యమైన మహిళా సంఘాల సభ్యులతో ఆమె మాట్లాడి, ఉద్యోగులకు అందిస్తున్న ఆహార సేవలు, రోజువారీ–నెలవారీ వ్యాపార లావాదేవీలు, క్యాంటీన్‌కు వచ్చే అతిథుల సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.అలాగే కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల కొనుగోలు విధానం, వాటి ధరలు, క్యాంటీన్ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల గురించి మహిళలను ప్రశ్నించారు. మహిళా సంఘాలకు మరింత ఆర్థిక బలం చేకూరేలా ఉద్యోగులకు ఫుడ్ సేఫ్టీపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని SERP అధికారులకు సూచించారు.
విజయ డెయిరీ ఉత్పత్తులకు ప్రత్యేక స్టాల్
క్యాంటీన్ ప్రాంగణంలో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా మహిళా సంఘాల సభ్యులతో దివ్య దేవరాజన్ చర్చించారు. దీనివల్ల మహిళా సంఘాలకు అదనపు ఆదాయ వనరులు ఏర్పడటంతో పాటు, ఉద్యోగులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. క్యాంటీన్‌లో అందిస్తున్న సేవలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా సంఘాల సభ్యులను ప్రోత్సహించేందుకు స్వయంగా క్యాంటీన్‌లో కాఫీ ఆర్డర్ చేసి, డిజిటల్ పద్ధతిలో చెల్లింపు చేశారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడంలో కీలకంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో SERP డైరెక్టర్ శ్రీ జాన్సన్, టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటీ) శ్రీ వి. శివాజీ, కంపెనీ సెక్రటరీ శ్రీ అనీల్ కుమార్, ఎస్‌ఈ (సివిల్) శ్రీ రవికాంత్ రెడ్డి, ఏడీఈ (సివిల్) శ్రీ ఉజ్జనప్ప గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


