ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సంబురాలు..
ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి .. ఈ సందర్భంగా జాతి నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి తదనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక దినమని అన్నారు. నిజాం పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం, చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి నిర్ణయాత్మక నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయిందని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన చరిత్ర కేవలం ఒక తేదీ కాదని, అది ప్రజల పోరాటం, త్యాగం, స్వాభిమానం, జాతీయ సమైక్యతకు ప్రతీక అని అన్నారు. ఈ చరిత్రను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రెండేళ్ల ప్రజా పాలన ప్రస్థానంలో..గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలబెట్టిందన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవాన్ని అందించి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ గ్రేడ్ సెక్షన్ ఆఫీసర్ విట్టల్, మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులు, డైరెక్టర్లు , సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


