నాగర్ కర్నూల్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకం ఆవిష్కరించిన ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
నాగర్ కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరులకు నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.ప్రభుత్వ పథకాల ప్రగతిపై వెల్లడించిన వివరాలు: మహాలక్ష్మి, గృహజ్యోతి: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా జిల్లాలో 10.56 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయని, రూ.499.85 కోట్లు ఆదా అయ్యిందన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్‌తో 1.18 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, గృహజ్యోతి కింద 1,15,461 కుటుంబాలకు జీరో బిల్లులు వచ్చాయని తెలిపారు. రేషన్, ఆరోగ్యశ్రీ: రేషన్ కార్డుదారులకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 2,79,133 కార్డుల పరిధిలో 8,99,385 మందికి లబ్ధి చేకూరుతోందన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, జిల్లాలో 44,115 మందికి రూ.117.60 కోట్లతో వైద్య సేవలు అందించామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు: మొదటి విడతలో 11,922 ఇళ్లు మంజూరు కాగా 9,809 మందికి పత్రాలు ఇచ్చామని, 5,269 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, 2,361 పూర్తయ్యాయని, రూ.197.24 కోట్లు విడుదల చేశామన్నారు. రైతు భరోసా: వానాకాలం 2026-27 కింద 3.08 లక్షల మంది రైతులకు రూ.422.56 కోట్ల పెట్టుబడి సాయం జమ చేశామని, రైతు బీమా కింద 1,141 కుటుంబాలకు రూ.57.05 కోట్లు చెల్లించామని తెలిపారు. విద్య, సాగునీరు: జిల్లాలో 753 ప్రభుత్వ పాఠశాలల్లో 48,798 మంది విద్యార్థులు ఉన్నారని, SSCలో 99.03 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు రూ.5,861 కోట్లు కేటాయించి 3.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపి ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


