దోమలు, వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించండి
గ్రామ పంచాయతీ పాలకవర్గానికి జటప్రోలు గ్రామీణులు, యువకుల వినతి
పెంట్లవెల్లి : పెంట్లవెల్లి మండల జటప్రోలు గ్రామంలో ఎదురవుతున్న తీవ్ర పారిశుధ్య, రక్షణ సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుతూ జటప్రోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు గ్రామ యువకులు, పెద్దలు కలిసి గురువారం వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గ్రామ యువకులు మాట్లాడుతూ... గ్రామంలో దోమల ఉధృతి తీవ్రంగా పెరిగిపోయిందని, ప్రజలు రోగాల బారిన పడకముందే తక్షణమే దోమల నివారణ మందు (ఫాగింగ్) పిచికారీ చేయించాలని కోరారు. అలాగే గ్రామంలో వీధి కుక్కలు వందల సంఖ్యలో సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు, బాటసారులపై ఇవి దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ప్రజా ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ యంత్రాంగం తక్షణమే స్పందించి ఈ రెండు సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు సులిగిరి తరుణ్, మంజునాథ్, నలవల శివకుమార్, ప్రకాష్, బన్నీ, శివతో పాటు గ్రామ పెద్దలు హనుమంతు, గోపాల్ మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


