భర్తీపూర్‌లో బాబా మళ్లీ కార్యకలాపాలు
- సంతానం పేరుతో అమాయక దంపతులే టార్గెట్
- గతంలో కేసు నమోదైనా.. మళ్లీ అదే వ్యవహారం
- అధికారుల నిఘా ఎక్కడ?
మెట్‌పల్లి, : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం భర్తీపూర్ గ్రామంలో ఓ వ్యక్తి మరోసారి ‘బాబా’ అవతారం ఎత్తినట్లు ప్రచారం జరుగుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అమాయక ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుని, ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక పూజలు, పరిహారాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత? అసలు అక్కడ ఏం జరుగుతోంది? అనేది అధికారుల సమగ్ర విచారణతోనే తేలాల్సి ఉంది.
దేవుడు వస్తాడు.. దయ్యం పోతుంది అంటూ ప్రచారం?
గతంలో ఇదే వ్యక్తి ‘దేవుడు వస్తాడు.. దయ్యం పోతుంది’ అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు స్థానికంగా ప్రచారం ఉంది. ముఖ్యంగా సంతానం లేని దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్మించేవారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఈ వ్యవహారంపై గతంలో పత్రికల్లో కథనాలు రావడంతో పాటు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. గతంలో పోలీసు కేసు వరకు వెళ్లడంతో కొద్ది రోజులు తన కార్యకలాపాలు నిలిపివేసి వ్యవహారం సద్దుమణితో మళ్లీ ప్రారంభించినట్లు సమాచారం. వ్యవహారం ప్రస్తుతం మళ్లీ కొనసాగుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? గతంలో నమోదైన కేసులో పోలీసుల దర్యాప్తు ఏం తేల్చింది? కేసు పరిస్థితి ఏమిటి? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సంతానం కలగక మానసికంగా ఇబ్బంది పడుతున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని పూజలు, మంత్రాలు, పరిహారాల పేరుతో లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నారా? ఒక్కో దంపతుల నుంచి ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారు? డబ్బులు చెల్లిస్తే సంతానం కలుగుతుందని హామీలు ఇస్తున్నారా? ప్రజలను భయపెట్టేలా ‘దేవుడు’, ‘దయ్యం’ పేర్లను ఉపయోగిస్తున్నారా? అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గతంలో కేసు.. అయినా మళ్లీ ఇదే వ్యవహారమా?
ఇదే తరహా ఆరోపణలపై గతంలో కేసు నమోదైనట్లు సమాచారం ఉన్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ ఇలాంటి ప్రచారం తెరపైకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటి? ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లభించాయి? ప్రస్తుతం జరుగుతున్నట్లు చెబుతున్న వ్యవహారానికి గత ఘటనతో ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
అధికారుల నిఘా ఎక్కడ?
ఒకవైపు ప్రజలను మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకురావాలని అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. మరోవైపు గ్రామాల్లో ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. భర్తీపూర్‌లో జరుగుతున్నట్లు చెబుతున్న వ్యవహారంపై స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే అమాయక ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేక ప్రచారంలో ఉన్న ఆరోపణలకు వాస్తవ ఆధారాలు లేవా? అనే విషయాన్ని అధికారులు సమగ్రంగా విచారించి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది. గతంలో కేసు నమోదైనట్లు చెబుతున్న నేపథ్యంలో ఆ కేసు వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై కూడా స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
ఎస్ ఐ నవీన్ కుమార్ ఇబ్రహీంపట్నం
విషయమై ఎస్ఐ నవీన్ విజన్ ఆంధ్ర విలేఖరి వివరణ కోరగా గతంలో వచ్చిన ఫిర్యాదు మేరకు భర్తీపూర్ బాబా సొంటి మోహన్ యోగి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినాము. మళ్లీ కార్యకలాపాలు సాగీస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపినారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


