డీసీసీ భవన్‌లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

డీసీసీ భవన్‌లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

  •  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎంపీ కడియం కావ్య,
  • ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

హన్మకొండ న్యూస్ : హనుమకొండ: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో గురువారం సంబరాలు ఘనంగా నిర్వహించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు  కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, టిపిసిసి మహిళా అధ్యక్షురాలు  ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వర్ రావు, లైబ్రరీ ఛైర్మన్ అజీజ్ ఖాన్, టిపిసిసి అఫిషియల్ స్పోక్స్ పర్సన్  కూచన రవళి మరియు జిల్లా కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ*.. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని కొనియాడారు. ఈ విలీన చరిత్రను మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలని, భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యమొస్తే.. మన తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత, అంటే 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛ వచ్చిందని.. నాటి భారత దేశ హోం మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న ఉక్కు నిర్ణయం, నడిపించిన 'ఆపరేషన్ పోలో' వల్లే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని..  కాబట్టి తెలంగాణను భారతదేశంలో భాగం చేసిన ఘనత, ఆ చరిత్ర ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. కానీ ఈ రోజు కొందరు ఈ చారిత్రక ఘట్టాన్ని కేవలం ఓట్ల కోసం, రాజకీయం కోసం వాడుకుంటూ మతాల మధ్య చిచ్చులు పెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విద్వేష రాజకీయాలకు తావివ్వదు. అందుకే మన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజును నిజాం అణచివేత ముగిసి, ప్రజల చేతికి అధికారం వచ్చిన రోజుగా భావిస్తూ... అధికారికంగా "ప్రజా పాలన దినోత్సవం" గా నిర్వహిస్తోందని అన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో మరో రకమైన నిరంకుశ పాలన సాగింది. కానీ ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. నాడు ప్రజా పోరాటాలతో నిజాంను ఎలా గద్దె దించామో.. నిన్నటి ఎన్నికల్లో కూడా ప్రజలంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఇవాళ మన ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ, రైతులకు రుణమాఫీ చేస్తూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ నిజమైన ప్రజా పాలనను అందిస్తోంది. ఈ శుభదినాన.. నాడు నిజాంకు వ్యతిరేకంగా, రజాకార్ల క్రూరత్వానికి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ  కడియం కావ్య మాట్లాడుతూ*.. తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరంకుశత్వ విముక్తికి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు సెప్టెంబర్ 17వ తేదీ నిదర్శనమని పేర్కొన్నారు. సాయుధ పోరాట యోధుల వీరోచిత త్యాగాలు, అమరవీరుల బలిదానాల పునాదులపైనే నేడు తెలంగాణలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందని ఆమె కొనియాడారు.గత పాలకుల హయాంలో ప్రజల గొంతుకలను నొక్కేసే ప్రయత్నం జరిగిందని విమర్శిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిజమైన 'ప్రజాపాలన'ను అందిస్తోందని స్పష్టం చేశారు. నాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు ద్వారా అట్టడుగు వర్గాలకు చేరవేస్తోందని అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు, పరిష్కరించేందుకు సచివాలయ తలుపులు తెరిచిన ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సభ్యురాలిగా వరంగల్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ కావ్య పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఛైర్మన్లు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ మరియు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, RGPRS నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, NSUI ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు మరియు కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News