తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, పోరాట పటిమకు సజీవ సాక్ష్యం ప్రజా పాలన దినోత్సవం
టిజిఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
హన్మకొండ న్యూస్ : సెప్టెంబర్ 17 అనేది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు ఇది మన ప్రాంత స్వేచ్ఛా స్వాతంత్ర్యాల చరిత్రలో ఒక సువర్ణాక్షరమని టిజిఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హన్మకొండ నక్కలగుట్ట విద్యుత్ భవన్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ వేడుకలకు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలాపించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పూలతో నివాళులు అర్పించారు. ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, పోరాట పటిమకు సజీవ సాక్ష్యం 'ప్రజా పాలన దినోత్సవం' అని పేర్కొన్నారు. నిజాం పరిపాలనలో, ఫ్యూడల్ వ్యవస్థల అణచివేతలో రజాకార్ల అరాచకాల మధ్య నలిగిపోయిన తెలంగాణ సమాజం తలవంచకుండా నిలబడిందన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాగాపూర్ లో ఎక్కువగా మహాసభలు నిర్వహించేదని, మన తెలంగాణ ప్రాంత ప్రజలు ఆ సభలకు ఎక్కువగా హాజరు కావడం వలన మనలో జాతీయత భావం పెంపొందిందని అన్నారు. అలాగే కమ్యూనిస్టులు పల్లె పల్లెనా తిరుగుతు జాతీయ భావాన్ని జానపద గాధల ద్వారా ప్రజల్లో నింపి చైతన్య పర్చారని చెప్పారు. తెలంగాణలో రజాకార్లు, నిజం పాలనా వలన పేదరికం బాగా ఉండేదని, అక్షరాస్యత చాలా తక్కువ ఉండేదని చెప్పారు. ఒక్కటే పంట మీద ఆధారపడి జీవనం సాగించేవారన్నారు. కరువు సమయంలో 1/3 వంతు భూమి శిస్తు వసూలు చేసేవారని , పంటలు లాక్కోవడం వలన స్వాతంత్రం రావాలని పోరాటం చేసారని అన్నారు. 1930లు, 40ల కాలంలో కమ్యూనిస్టులు, ప్రజా సంఘాల నాయకత్వంలో పల్లెపల్లెనా ఎగిసిపడిన విప్లవాగ్ని ఈ నేల స్వేచ్ఛకు పునాది వేసిందని చెప్పారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన ఆ పోరాటం ప్రపంచ చరిత్రలోనే అరుదైందన్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యమొచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం స్వతంత్రంగా మారడానికి మరికొంత సమయం పట్టిందన్నారు. 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారని , కాని తెలంగాణ స్వతంత్ర దేశంగా ఉంటుందని నిజాం ప్రకటించారని చెప్పారు. ఈ నేపథ్యంలోఅప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సమర్థవంతమైన నాయకత్వంలో జరిగిన 'ఆపరేషన్ పోలో' (మిలిటరీ చర్య) ద్వారా నిజాం పాలన ముగిసి, ఈ ప్రాంతం భారత ప్రజాస్వామ్య యూనియన్‌లో అంతర్భాగమైందిని వివరించారు. ఎవరి పెత్తనాన్ని అంగీకరించక, స్వేచ్ఛ సమానత్వం కోసం శ్రమించే నైజం తెలంగాణ మట్టిలోనే ఉందని వ్యక్తం చేశారు. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మనం మన పని సంస్కృతిలో కూడా ప్రదర్శించాలని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ను అందించడమే మనం ఆ అమరవీరులకు ప్రజా పోరాటాలకు ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.మన సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి, పారదర్శకమైన ప్రజానుకూలమైన సేవలను అందించడానికి ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక స్ఫూర్తితో పునరంకితం కావాలని పిలుపునిస్తున్నానన్నారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి. తిరుపతి రెడ్డి, టి . మధుసూదన్,సి. ప్రభాకర్, సీవీవో బోనాల కిషన్ , సి.ఈలు: కె .తిరుమల్ రావు, అశోక్, అన్నపూర్ణ , వెంకటరమణ , గౌతమ్ రెడ్డి , మల్లికార్జున్ , సీజియంలు చరణ్ దాస్ , కిషన్ , కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీలు రమేష్ , శ్రీ కృష్ణ , జియంలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

