రిమ్స్ ఘటనలో బాధిత చిన్నారులందరికీ మెరుగైన వైద్యం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
- ఐదుగురు మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
- 12 మంది చిన్నారులు డిశ్చార్జ్..*ఎనిమిది మంది హైదరాబాద్‌లో, ఇద్దరు రిమ్స్‌లో చికిత్స
- నవజాత శిశువుల సంరక్షణకు 34 పడకల ఎంఎన్‌ఐసీయూ ఏర్పాటు
- బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అండగా ఉంటాయి:*జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ : రిమ్స్ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ)లో చోటుచేసుకున్న ఘటనలో బాధితులైన చిన్నారులందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని, వారి ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అండగా ఉంటాయని, అవసరమైన వైద్య సేవలు, సహాయక చర్యలు అందేలా చర్యలు చేపడుతున్నామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన ఘటనలో దురదృష్టవశాత్తు ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడిన 12 మంది చిన్నారులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. డిశ్చార్జ్ అయిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అవసరమైన ఫాలో-అప్ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. డిశ్చార్జ్ అయిన చిన్నారుల్లో ఏడుగురు మహారాష్ట్రకు చెందినవారని కలెక్టర్ పేర్కొన్నారు. వారి వివరాలను నాందేడ్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు అందించి, అక్కడి అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. మిగిలిన ఐదుగురు చిన్నారులు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారని, వారికి స్థానిక వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన వైద్య సలహాలు, సేవలు అందిస్తున్నామని వివరించారు.ప్రస్తుతం ఎనిమిది మంది చిన్నారులు హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన చికిత్స అందుతున్నట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు చిన్నారు లు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సంబంధిత వైద్య బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.రిమ్స్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు అందించే వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా 34 పడకల సామర్థ్యంతో ఎంఎన్‌ఐసీ యూ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నవజాత శిశువులకు అవసరమైన ప్రత్యేక వైద్య సంరక్షణను అందించేందుకు ఈ విభాగాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఎంఎన్‌ఐసీయూ విభాగంలో ఆక్సిజన్ సదుపాయం తో 11 పడకలు, ఆక్సిజన్ సదుపాయం లేని ఏడు పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా స్టెప్-డౌన్ యూనిట్‌లో ఆక్సిజన్ సదుపాయంతో 12 పడకలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం రిమ్స్‌లో మొత్తం 30 పడకలతో నవజాత శిశు సంరక్షణ సేవలు అందుతున్నాయని, త్వరలో అదనంగా మరో నాలుగు పడకలను అందుబాటులోకి తీసుకువచ్చి మొత్తం సామర్థ్యాన్ని 34 పడకలకు పెంచుతామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బాధిత చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అండగా ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. నవజాత శిశువులకు మెరుగైన ఉచిత వైద్య సహాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు, నవజాత శిశువుల సంరక్షణ సేవలను మరింత పటిష్ఠం చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


