విద్యార్థుల్లో ఔత్సాహిక నైపుణ్యాల అభివృద్ధికి ఐఐసీ అవగాహన కార్యక్రమాలు
చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని సుల్తాన్పూర్ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా విధానం, ఆవిష్కరణలపై ఆసక్తి, ఔత్సాహిక నైపుణ్యాలను పెంపొందించేందుకు జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సుల్తాన్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న జెడ్పీహెచ్‌ఎస్ శివంపేటలో, సెప్టెంబర్ 25న టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ అందోల్‌లో “డెవలపింగ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్ – ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ ఇన్ స్కూల్స్” కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, వ్యాపార దృక్పథాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, సీనియర్ ప్రొఫెసర్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డా. ఎస్. విశ్వనాథ రాజు మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని వివరించారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే కొత్త విషయాలను నేర్చుకోవడం, ప్రశ్నించడం, ప్రయోగాలు చేయడం, తమ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు.విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి వాటికి వినూత్న పరిష్కారాలను కనుగొనేలా సృజనాత్మక ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన తెలిపారు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సమాజానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలను రూపొందించాలని సూచించారు.కళాశాల ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అధికారి, ప్రొఫెసర్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా. ఎం. శైలజ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి, స్టార్టప్‌లు, వ్యాపార అవకాశాల వైపు కూడా దృష్టి సారించాలని సూచించారు. తమ చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి వాటికి సృజనాత్మకమైన, ఆచరణాత్మకమైన పరిష్కారాలను ఆలోచించడం ద్వారా మంచి వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.సమస్యను గుర్తించడం, కొత్త ఆలోచనను రూపొందించడం, దానిని ఆచరణలో పెట్టడం, బృందంగా పనిచేయడం, కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలు భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. అలాగే కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ టెక్నాలజీలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సృజనాత్మకంగా వినియోగించి సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు.
దశలవారీగా వివిధ కార్యక్రమాలు
కళాశాల IIC ఆధ్వర్యంలో విద్యార్థుల ఔత్సాహిక నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలను దశలవారీగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా..
1. ఔత్సాహిక నైపుణ్యాల అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం
2. క్షేత్రస్థాయి సందర్శన, కొత్త ఆలోచనల రూపకల్పన
3. విద్యార్థుల ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ప్రోటోటైప్, బిజినెస్ మోడల్ అభివృద్ధి
4. స్టార్టప్‌లకు అందుబాటులో ఉన్న సహాయ వ్యవస్థ, మేధో సంపత్తి హక్కులపై అవగాహన
5. విద్యార్థులు రూపొందించిన ప్రోటోటైప్‌ల ప్రదర్శన, డెమో డే
వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.విద్యార్థులు రూపొందించే వినూత్న ఆలోచనలు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్, ప్రోటోటైప్‌లకు ప్రాధాన్యతనిస్తూ వాటిని ప్రదర్శించే అవకాశాలను కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాల వివరాలు, విద్యార్థుల ప్రదర్శనలు, సంబంధిత నివేదికలను IIC పోర్టల్‌లో నమోదు చేసి అప్‌లోడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వినూత్న ఆలోచనలు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్, ప్రోటోటైప్‌లు తదుపరి స్థాయి ప్రదర్శనలు లేదా పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎంపికైన ఉత్తమ ఆవిష్కరణలకు జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం కల్పించడంతో పాటు, రూ.1.24 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందే అవకాశం కూడా ఉంటుందని నిర్వాహకులు వివరించారు.ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, బృందంగా పనిచేసే నైపుణ్యం, కమ్యూనికేషన్, ఔత్సాహిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగాలను కోరుకునే వారిగానే కాకుండా ఉద్యోగాలను సృష్టించే యువ ఔత్సాహికులుగా ఎదగడానికి ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


