మాతా శిశు సంరక్షణకు పెద్దపీట : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
- రిమ్స్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రత్యేక వార్డులు
- అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియ
- రిమ్స్‌ను సందర్శించి వైద్య సేవలు, భద్రతా ప్రమాణాలను సమీక్షించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల నవజాత శిశువుల వార్డులో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆసుపత్రిలో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేస్తున్నామని తెలిపారు. మాతా శిశు మరణాలను తగ్గించడంతో పాటు, నవజాత శిశువులకు అత్యుత్తమ వైద్య సేవలు స్థానికంగానే అందేలా రిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులతో కలిసి రిమ్స్‌ను సందర్శించిన కలెక్టర్, క్రిటికల్ కేర్ వార్డు, పీడియాట్రిక్స్ విభాగం, మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డుతో పాటు పలు విభాగాలను పరిశీలించారు. ఎయిమ్స్ వైద్యులతో కలిసి చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, సిబ్బంది పనితీరు, అత్యవసర వైద్య సదుపాయాలను సమీక్షించారు.రిమ్స్ పీడియాట్రిక్స్ విభాగంలో నవజాత శిశువుల కోసం ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. తల్లులు, చిన్నారుల సౌకర్యార్థం మదర్ బెడ్స్‌తో పాటు ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఆక్సిజన్ లైనింగ్, బేబీ వార్మర్లు, సిపిఏపి సపోర్ట్, వెంటిలేటర్లు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌క్యుబేటర్ వంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మొత్తం 34 బెడ్లను ఏర్పాటు చేయగా, 23 బెడ్లకు డైరెక్ట్ ఆక్సిజన్ సదుపాయం, 11 బెడ్లకు సిపిఏపి సపోర్ట్ అందుబాటులో ఉందన్నారు. మాతా శిశు వైద్య నిపుణులు, పీడియాట్రిషియన్లు, ప్రత్యేక శిక్షణ పొందిన స్టాఫ్ నర్సులు నిరంతరం అందుబాటులో ఉంటూ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారని తెలిపారు. రిమ్స్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. అగ్ని ప్రమాద ఘటనపై సమ గ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలోని భద్రతా ప్రమా ణాలను సమగ్రంగా పరిశీలించి, లోపాలను గుర్తించి అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.రిమ్స్‌లో చికిత్స పొందుతున్న కొంతమంది చిన్నారులు కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని, మరికొందరు వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఆరోగ్యంగా, నిలకడగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. అత్యవసరంగా మెరుగైన వైద్యం అవసరమైన చిన్నారులను సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బుధవారం రాత్రి 15 మంది చిన్నారుల్లో ఏడుగురిని హైదరాబాద్‌కు సురక్షితంగా తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మాతా శిశు సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, రిమ్స్‌లో వైద్య సేవల నాణ్యతతో పాటు భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు.
రిమ్స్ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు మరిపెల్లి చందన, ప్రేమలత అగర్వాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం వారు రిమ్స్‌ను సందర్శించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేతను వారు ప్రస్తావించారు. చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని మహిళా కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారు లను ఆదేశించినట్లు వారు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మహిళా కమిషన్ తరఫున పూర్తి అండగా ఉంటా మని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, డీడబ్ల్యూఓ మిల్కా, బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, వైద్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


